పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
అచ్చం అమ్మలా...
Published on Thu, 04/02/2026 - 03:17
సాంకేతికతకు, సామాజిక స్పృహ తోడైతే అది మానవత్వానికి మరో అడుగు అవుతుంది. ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ల గురించి తెలుసుకున్న ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ‘అయ్యో!’ అనుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. తమ ఆలోచనలు, సాంకేతిక జ్ఞానానికి పదును పెట్టి ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్‌ను అన్ని రకాలుగా గైడ్ చేసే 24/7 థెరపిటిక్ ఏఐ–చాట్‌బాట్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
సాంగ్లీ (మహారాష్ట్ర)లోని రాజారాంబాపు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో తెల్లవారుజామున అక్కడొకరు, ఇక్కడొకరు నిద్ర లేస్తున్నారు. అయితే ఒక కంప్యూటర్ ల్యాబ్ లోపల ముగ్గురు యువ ఇంజినీర్‌లు మాత్రం నిద్ర అనేదే లేకుండా దీక్షగా పనిలో నిమగ్నమయ్యారు. కోడ్‌ను మెరుగు పరుస్తూ, రెస్పాన్స్‌ను పరీక్షిస్తూ ఏఐ సిస్టమ్‌కు శిక్షణ ఇస్తున్నారు. ‘న్యూరోస్టార్స్’గా పిలవబడే వైష్ణవి రాజ్‌కుమార్ పాటిల్, అభిషేక్ శివప్రసాద్, గణేష్ రామచంద్రలకు అదొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా మారింది.
ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు రోజూ ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడడానికి రూపొందించిన వారి ఏఐ–ఆధారిత చాట్‌బాట్ నేషనల్ ఏఐ హ్యాక్‌థాన్‌లో గ్రాస్ప్ 2026 గెలుచుకుంది. అయిదువేల మంది విద్యార్థులతో పోటీపడి ఈ ముగ్గురు ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్’ విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లక్ష రూపాయల నగదు, మెంటర్‌షిప్ అవకాశాలు, ఇంటర్న్‌షిప్స్, ఒక యూరోపియన్ యూనివర్శిటీతో కలిసి పనిచేసే అవకాశం వారికి లభించింది.
ఆ రోజు నుంచే...
ఈ ముగ్గురు మిత్రుల క్లాస్‌మేట్ ఒకరు ఒకరోజు తన సోదరికి ఉన్న ఆటిజం సమస్య గురించి వివరిస్తూ, తమ కుటుంబం పడే బాధలను చెప్పుకుంటూ వచ్చాడు. ‘అయ్యో!’ అనుకోవడానికే పరిమితం కాలేదు వారు. ఎంతోమంది యువతీయువకులతో ‘యునైటెడ్ ఫర్ ఆటిజమ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊరూవాడ, పాఠశాలలు తిరుగుతూ ఆటిజం గురించి అవగాహన పరిచేవారు. కాలక్రమంలో ఇది ‘డ్రీమ్ ఉడాన్ ఫౌండేషన్’ అనే రిజిస్టర్డ్ ఎన్‌జీవోగా రూపాంతరం చెందింది.
‘డ్రీమ్ ఉడాన్ ఫౌండేషన్’తో ప్రయాణం ప్రారంభించిన తరువాత లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగలిగారు. మన దేశంలో ఆటిజం అనేది నిర్మాణాత్మక సవాళ్లతో కూడుకొని ఉంది. ఆటిజం గురించి బొత్తిగా అవగాహన లేని తల్లిదండ్రులు, పరిమిత సంఖ్యలో థెరపిస్ట్‌లు, అరుదైన సెషన్‌లు, అధిక ఖర్చులు... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కోవిడ్ కల్లోల కాలం తరువాత ఆటిజం కేసుల సంఖ్య 30 శాతం పెరిగిందనే వార్త ముగ్గురు మిత్రులను ఆందోళనకు గురి చేసింది.
ఆ పరిశోధన ఫలితమే....
శాస్త్రీయమైన మార్గదర్శకత్వం ఉంటే ‘ఇలా చేయాలి...అలా చేయకూడదు’ అనే అవగాహన తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులకు శాస్త్రీయ మార్గదర్శకత్వం దొరకడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ స్టూడెంట్స్‌గా ‘ఆటిజం కేర్’కు సంబంధించి అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చు అయ్యే సాంకేతికత వైపు దృష్టి పెట్టిన ముగ్గురు మిత్రులు ఎన్నో పరిశోదనలు చేశారు. వారి పరిశోధన ఫలితమే.. 24/7 థెరపటిక్ ఏఐ–పవర్డ్ చాట్‌బాట్.
‘ఇలా ఉండాలి... అంటూ చాట్‌బాట్‌కు సంబంధించి ఐడియా అయితే ఉందిగానీ, ఎలాంటి టూల్స్‌ను ఉపయోగించాలనేది మాకు తెలియదు’ అని తొలిరోజులను గుర్తు చేసుకున్నాడు అభిషేక్.
సాంకేతికతకు సంబంధించి తమ డిపార్ట్‌మెంట్ హెడ్ సహాయం తీసుకున్నారు. దీనికి ముందు...‘చాట్‌జీపీటి కూడా ఆటిజంకు సంబంధించి మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది కదా, మరి మీ ప్రత్యేకత ఏమిటి?’ అని డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రశ్నించారు. దీంతో మరింత లోతుగా పరి«శోధించాలనుకున్నారు. గూగుల్ సహకారంతో జరిగిన ‘హాక్‌థాన్’ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నెలరోజుల పాటు మెంటార్‌షిప్, గూగుల్ క్లౌడ్ టూల్స్‌కు యాక్సెస్ దొరకడంతో తమ సాంకేతిక విధానాన్ని అన్ని రకాలుగా మెరుగుపర్చుకునే అవకాశం వచ్చింది.
స్కోర్ ఆధారంగా....
డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రశ్న ముగ్గురిని విస్తృతమైన పరిశోధన క్షేత్రంలోకి తీసుకువెళ్లింది. తమ అన్వేషణలో భాగంగా రీట్రైవల్–అగ్‌మెంటెడ్ జనరేషన్ (ఆర్‌ఏజీ), ఆగ్నెటిక్ ఏఐలాంటి సాంకేతికతను అధ్యయనం చేయడం ప్రారంభించారు. కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపిన కొద్దీ ప్రతి బిడ్డ అవసరాలు భిన్నంగా ఉంటాయని, ఆ అవసరాలకు తగినట్లుగా పరిష్కారాలు ఉండాలని ఆలోచించారు. అప్లికేషన్‌లో ఏక్యూ పరీక్షను ప్రవేశపెట్టారు. ఇది ప్రామాణికమైన క్లినికల్ స్క్రీనింగ్ సాధనం. దీనిని మరింత పర్సనలైజ్‌డ్‌గా తీర్చిదిద్దారు.
‘తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు చాట్‌బాట్ స్కోర్‌ను రూపొందిస్తుంది. స్కోర్ 20 కంటే తక్కువ ఉంటే తక్కువ అని, 20 నుండి 30 మధ్య ఉంటే మధ్యస్థం అని, 30 కంటే ఎక్కువ ఉంటే సమస్య అధికం అని అర్థం. వీటి ఆధారంగా మేము సమాధానాలను సర్దుబాటు చేస్తాం’ అని విపులీకరించాడు అభిషేక్.
రెండో దశలో భాగంగా థెరపిస్ట్‌లతో మాట్లాడి వారు నిర్వహించే సెషన్‌లలోని విషయాల గురించి తెలుసుకున్నారు. ఆటిజం పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు రోజువారీగా ఎదుర్కొనే ఇబ్బందులు... అస్మాత్తుగా తీవ్రమైన కోపం, నిద్ర సమస్యలు... మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని బిహేవియరల్ ట్రాకర్‌ను రూపొందించారు.
డైలీ ట్రాకర్
పిల్లల్లో కొన్ని కీలక ప్రవర్తనలను (కీ బిహేవియర్స్) గుర్తించాం. నిద్ర తీరు, సంభాషణ, మానసిక స్థితి... మొదలైన వాటి ఆధారంగా తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను నిరంతరం పర్యవేక్షించేలా డైలీ ట్రాకర్‌ను రూపొందించాం. తల్లిదండ్రులు రోజూ నమోదు చేసే వివరాలను వీక్లి ఇన్‌సైట్స్‌గా కన్వర్ట్ చేస్తుంది సిస్టమ్. కీలకమైన ప్రవర్తనల ఆధారంగా ఆటిజం ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని డ్యాష్‌బోర్డ్ తయారవుతుంది. పిల్లలకు ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాకపోతే చాట్‌బాట్‌ను అడగవచ్చు. అది క్షణాల్లోనే సమాధానం ఇస్తుంది.
– అభిషేక్
Tags : 1