ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
ఏటీఎం రూల్స్.. ఇక మారిపోయాయ్..
Published on Wed, 04/01/2026 - 15:18
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.
నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్‌డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.
ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్‌డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గింది
అయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్‌ను పీఎన్‌బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.
బంధన్ బ్యాంక్
బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.
ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.
ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇక తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.
ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
Tags : 1