ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
త్వరలో బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధరల ప్రకటన!
Published on Tue, 03/24/2026 - 12:56
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధరను (ఎంఆర్‌పీ) కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలోనే ఖరారు చేయనుంది. 2026-27 సీజన్‌కు సంబంధించి బోల్‌గార్డ్-1 (బీజీ-1), బోల్‌గార్డ్-2 (బీజీ-2) రకాల ధరలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అయితే, ప్రభుత్వం పత్తి విత్తనాలపై ప్రకటించేది గరిష్ట ధర మాత్రమే. కంపెనీలు లేదా డీలర్లు అంతకంటే తక్కువ ధరకే విక్రయించవచ్చు కానీ, ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.
ధరల్లో మార్పు ఉంటుందా?
గత కొన్నేళ్ల ధోరణిని పరిశీలిస్తే ఈ ఏడాది విత్తన ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తుది నిర్ణయం ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది (2025-26) బీజీ-2 450 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.900గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు 2024-25లో ఇది రూ.864గా ఉండేది. 2016లో ధరల నియంత్రణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజీ 1 ధర రూ.635 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.
2019-20లో కూడా ప్రభుత్వం ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచిన దాఖలాలు ఉన్నాయి. గత ఏడాది సుమారు 4 శాతం మేర ధరలు పెరిగినందున ఈసారి పెంచకపోయినా విత్తన పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.
ధరల నియంత్రణపై భిన్నాభిప్రాయాలు
కాటన్ సీడ్స్ ప్రైస్ ఆర్డర్-2015 ప్రకారం, ధర పెంచినా పెంచకపోయినా ఏటా ప్రభుత్వం ఎంఆర్‌పీని నోటిఫై చేయడం చట్టపరమైన బాధ్యత. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2016కు ముందు విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విత్తనాలను విక్రయించి రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ప్రభుత్వం గరిష్ట ధరను (క్యాప్) నిర్ణయిస్తోంది. ఇది రైతులకు రక్షణ కవచం లాంటిదని అధికారులు పేర్కొంటున్నారు.
బీటీ పత్తి విత్తనాల ధరల నిర్ణయాన్ని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) వ్యతిరేకిస్తోంది. బీటీ విత్తనాలకు ధర నిర్ణయించడం వల్ల నాన్-జీఎం (సాధారణ) పత్తి విత్తనాలు కేవలం రూ.300-400కే లభిస్తున్నాయని, అలాగే గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి బీటీ విత్తనాలకు తగ్గిపోతోందని వారు వాదిస్తున్నారు.
సాగులో బీటీ పత్తిదే హవా..
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ గత నెల లోక్‌సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో 95 శాతం బీటీ పత్తిదే. అయితే, బీటీ పత్తిలోని ప్రొటీన్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని గులాబీ రంగు పురుగు పెంచుకోవడం ఇప్పుడు శాస్త్రవేత్తలను, రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పండించే అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పురుగు ఉధృతి పెరగడం సాగు ఖర్చును పెంచుతోంది.
ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు
Tags : 1