బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్
Breaking News
ధరలకు రెక్కలు
Published on Fri, 03/13/2026 - 00:57
న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) ఫిబ్రవరిలో 3.21 శాతానికి ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.74 శాతంగా (సవరించిన) ఉండడం గమనార్హం. ఆర్బీఐ లకి్ష్యత స్థాయి (4 శాతం)కి దిగువనే ఉన్నప్పటికీ.. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన తాజా గణాంకాలు ధరల ఒత్తిళ్లను తెలియజేస్తున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభంతో ధరల ఒత్తిళ్లు ఇక ముందూ కొనసాగొచ్చని ఆర్థికవేత్తల అంచనా. 2024 బేస్ సంవత్సరంతో, కొత్త సీపీఐ సిరీస్ ఆధారంగా విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇంతకుముందు 2012 బేస్ సంవత్సరంగా ఉండేది. అలాగే, సీపీఐ పరిధిలో వస్తువులను 299 నుంచి 358కి పెంచారు. ఆహార విభాగం వెయిటేజీ లోగడ ఉన్న 45 శాతం నుంచి 40 శాతానికి దిగొచ్చింది.
⇒ ఆహార వస్తువుల ధరలు జనవరిలో ఉన్న 2.13 శాతం నుంచి ఫిబ్రవరిలో 3.47 శాతానికి పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంలో ఆహార విభాగం ధరలే ప్రధాన పాత్ర పోషించాయి.
⇒ ఫిబ్రవరిలో ధరలు అధికంగా పెరిగిన వాటిల్లో ప్రధానంగా వెండి, బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలీఫ్లవర్ ఉన్నాయి.
⇒ వెల్లుల్లి, ఉల్లి, ఆలు, కందిపప్పు, లిచీ పండ్ల విభాగంలో ప్రతికూల ద్రవ్యోల్బణం (ధరలు క్షీణించడం) కనిపించింది.
⇒ ఇళ్ల ధరల (నిర్వహణ, మరమ్మతులు) తాలూకూ ద్రవ్యోల్బణం సైతం 3.2 శాతం నుంచి 3.26 శాతానికి చేరింది.
⇒ ప్రాథమిక విద్య ద్రవ్యోల్బణం 3.59 శాతం, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి 4.09 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
⇒ వస్తు రవాణాకు సంబంధించి 7.49 శాతం, ప్రయాణికుల రవాణా సేవలకు సంబంధించి 1.75 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది.
చమురు ధరలతో ఇంకా పెరిగే ముప్పు
పశ్చిమాసియా సంక్షోభంతో చమురు, గ్యాస్ ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో.. ప్రతీ 10 శాతం పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 0.40–0.60 శాతం మేర అధికమవుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా.
Tags : 1