రాసలీలలతో అడ్డంగా దొరికిపోయి కన్పించకుండా పోయిన బిఆర్ నాయుడు
Breaking News
ఆయిల్ రిటైల్ కంపెనీలకు గడ్డుకాలం!
Published on Thu, 03/12/2026 - 02:53
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల భారత ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా స్థానిక మార్కెట్లో వెంటనే ఇంధన ధరలను పెంచలేకపోవడంతో వాటి లాభాలు తగ్గే పరిస్థితి ఏర్పడినట్టు తెలిపాయి.
దేశ ముడి చమురు అవసరాల్లో 88 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. ఇందులో 30–44 శాతం మేర సరఫరాలు ఇరాన్ పక్కనే ఉన్న హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంటాయి. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే సరఫరాపై ప్రభావం పడుతుందన్నది రేటింగ్ సంస్థల అంచనా.
వ్యూహాత్మక నిల్వలు 10 రోజుల అవసరాలకు సరిపోతాయని, అలాగే, వాణిజ్య నిల్వలు 65 రోజులకు అవసరాలను తీరుస్తాయంటూ.. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే సరఫరా సమస్యలను ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడొచ్చంటూ రేటింగ్ సంస్థలు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్, మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్, ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించాయి.
రుణ పరపతిపై ప్రభావం..
ఇరాన్ ఆయిల్ లేదా ఎల్ఎన్జీ సరఫరా అవరోరధాలు దీర్ఘకాలం పాటు కొనసాగితే సమీప కాలంలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థల రుణ పరపతిపై ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, ప్రభుత్వ మద్దతు ఉండడం రేటింగ్‌కు మద్దతునిస్తుందని తెలిపింది. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను దేశీయంగా పెంచడం లేదు. ఇంధన విక్రయ మార్కెట్లో 90 శాతం వాటా ప్రభుత్వరంగ సంస్థల చేతుల్లోనే ఉండడంతో ఒక విధంగా ధరలు స్థిరంగా కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
దేశీయంగా ధరల సవరణకు పరిమిత అవకాశాలే ఉండడం కంపెనీలపై వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని.. మార్కెటింగ్ మార్జిన్లపై ప్రభావం పడి, నగదు ప్రవాహాలు తగ్గిపోతాయని మూడిస్ తెలిపింది. గతంలో ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆరంభమైన తర్వాత ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా నష్టాలు ఎదుర్కోగా, తర్వాత ధరలు కనిష్టానికి దిగి రావడంతో అవి భర్తీ అయినట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై కేంద్రం రూ.60 పెంచడం తెలిసిందే.
మార్కెట్ ధరలకంటే తక్కువకు ఎల్పీజీ విక్రయించడం వల్ల ఏర్పడే నష్టాల భర్తీకి కేంద్రం 2024–25లో కేటాయించిన రూ.30వేల కోట్ల మాదిరి బడ్జెట్ కేటాయింపులు చేయొచ్చని ఫిచ్, మూడిస్ పేర్కొన్నాయి. అధిక ముడి చమురు ధరల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై మిశ్రమంగా ఉండొచ్చని.. ముందస్తు నిల్వల కారణంగా తొలుత లాభపడొచ్చని, తర్వాత సరఫరా అవరోధాలతో రిఫైనరీ వినియోగం తగ్గించుకోవచ్చని అంచనా వేశాయి. ‘‘భారత్ తన చమురు అవసరాల కోసం సముద్ర రవాణాపైనే ఆధారపడి ఉంది.
అయితే, సరఫరా వైవిధ్యానికి కూడా అవకాశం ఉంది. ఆసియా వెలుపల రష్యా, దక్షిణ అమెరికా నుంచి గతంలో చమురు కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రష్యా నుంచి కొనుగోళ్లు ప్రస్తుతం రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే, గత నెలలో పునరుద్ధరించిన వెనెజువెలా నుంచి సరఫరా 1,42,000 బ్యారెళ్లుగా ఉంది’’అని ఎస్అండ్పీ రేటింగ్స్ తెలిపింది.
ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతోపాటు గెయిల్‌కు సమీప కాలంలో నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎక్కువ కాలం పాటు ఆయిల్ సరఫరాల సమస్యలు ఏర్పడితే ఓఎంసీల్లో అత్యధిక నగదు నిల్వలు కలిగిన బీపీసీఎల్ వీటిని తట్టుకోగలదని పేర్కొంది.
Tags : 1