బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
టాప్ గేర్‌లో వాహన విక్రయాలు
Published on Sun, 02/15/2026 - 05:25
న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్‌లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి.
గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్ చెప్పారు.
ఎగుమతులు జోరు
మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్‌పోర్ట్స్ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి.
ఎగుమతుల్లో మారుతీ టాప్
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలి్చంది. కంపెనీ ఎక్స్‌పోర్ట్స్ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్ గణాంకాల్లో వెల్లడైంది. భారత్ నుంచి మొత్తం పీవీల ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్ చెప్పారు. పరిశ్రమ ఎక్స్‌పోర్ట్స్ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్‌పోర్ట్స్‌కి ఊతమిస్తోందని రాహుల్ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానంగా యూరప్‌లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు.
Tags : 1