జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
ఎయిర్‌టెల్ వీక్ సిగ్నల్
Published on Fri, 02/06/2026 - 03:51
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 55 శాతం పడిపోయి రూ. 6,631 కోట్లకు పరిమితమైంది. నెట్‌వర్క్ నిర్వహణ వ్యయాలతోపాటు, ఉద్యోగ వ్యయాల పెరుగుదల, ప్రభుత్వ ఫీజులు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 14,781 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం మాత్రం 20 శాతం జంప్‌చేసి రూ. 53,982 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 45,129 కోట్ల టర్నోవర్ సాధించింది. దీనిలో దేశీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 39,226 కోట్లయ్యింది. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 28 శాతం ఎగసి రూ. 11,787 కోట్లకు చేరగా.. వీటిలో దేశీ వాటా 16 శాతం అధికంగా రూ. 9,250 కోట్లకు చేరింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు 7 శాతం పెరిగి రూ. 3,846 కోట్లయ్యాయి. ఉద్యోగ వ్యయాలు సైతం 12 శాతం అధికమై రూ. 1,958 కోట్లను తాకాయి.
కస్టమర్ల సంఖ్య అప్
తాజా సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్ ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 5.7 శాతం మెరుగుపడి రూ. 259ను తాకింది. కస్టమర్ల సంఖ్య 12 శాతం వృద్ధితో 57.6 కోట్లకు చేరింది. దేశీయంగా ఇది 13 శాతం పుంజుకుని 41.38 కోట్లకు చేరగా.. ఆఫ్రికాలో 10 శాతం బలపడి 17.93 కోట్లుగా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం బలహీనపడి రూ. 1,992 వద్ద ముగిసింది.
Tags : 1