అయ్యా ABN మెంటల్ కృష్ణ.. రాధా కృష్ణ తుక్కు రేగొట్టిన నాగమల్లేశ్వరి
Breaking News
మీ ఇల్లు బంగారంగానూ!
Published on Mon, 01/12/2026 - 06:38
తాకట్టు... రుణం!. ఈ రెండూ భవిష్యత్తుని నిర్ణయించేవే. అది ఎదగటమైనా... పాతాళానికి పడిపోవటమైనా!. దానికి దిక్సూచులు ఏ అవసరానికి తీసుకుంటున్నాం?
ఎంత క్రమశిక్షణతో తిరిగి తీరుస్తున్నామనేవే. ఇక రుణ ప్రపంచానికి హృదయం లాంటివి హోమ్‌లోన్... గోల్డ్ లోన్. ఒకటి ఆశలు నెరవేర్చేదైతే మరొకటి అవసరాన్ని తీర్చేది. మరి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో రెండూ ఈ రుణాలిస్తున్నాయి కదా... ఏది మంచిది? ఏ రుణం ఎక్కడ తీసుకుంటే మంచిది? వీటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ...
సరైన రుణాన్ని, సరైన సంస్థను ఎంచుకోకకపోవటం వల్ల లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉండదూ? గృహరుణంలో ఒక్క 0.5 శాతం తేడా వల్ల మనం చెల్లించే సొమ్ము కొన్ని లక్షల రూపాయలు పెరిగిపోతుందంటే ఇబ్బందికరంగా లేదూ? అందుకే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఎక్కడ రుణం తీసుకున్నా... మన అవసరమేంటన్నది ముఖ్యం. ఆ అవసరానికి మనకు ఎంత త్వరగా రుణం వస్తోంది? ఎంత వడ్డీకి వస్తోంది? మన దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయా? మనకు కొన్ని వెసులుబాట్లు అవసరమా? ఇలాంటివన్నీ చూసుకుని, దానికి తగ్గ సంస్థను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. అదెలాగో చూద్దాం...
గృహ రుణానికి బ్యాంకే మంచిదా?
గృహ రుణం తీసుకునే వారు ఒక్క వడ్డీ రేటే కాకుండా చాలా అంశాలు చూడాలి. అదేమిటంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంకుల్లోనే తక్కువ. ఎందుకంటే ఇవి ఆర్‌బీఐ రెపో రేటు మాదిరి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్‌తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్‌బీఐ రేట్లకు అనుగుణంగా తక్షణం మార్పుచేర్పులుంటాయి. ఉదాహరణకు 0.5 శాతం గనక వడ్డీ రేటు తగ్గితే... 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.3 లక్షలు మిగుల్చుకోవచ్చు.
పైపెచ్చు బ్యాంకుల్లో గృహ రుణాలను గరిష్టంగా 30 ఏళ్ల కాలానికీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలం కారణంగా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. కాకపోతే బ్యాంకుల్లో గృహ రుణ దరఖాస్తుల పరిశీలన చాలా కఠినంగా ఉంటుంది. ప్రాపరీ్టకి క్లియర్ టైటిల్‌తోపాటు, రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ (రుణ పరపతి/ రుణ చరిత్ర) 700కు పైన ఉండాలి. చెల్లింపుల సామర్థ్యాలనూ బ్యాంక్‌లు చూస్తాయి. దీనికితోడు న్యాయపరమైన క్లియరెన్స్ కూడా తీసుకుంటాయి. కనుక ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.
ఎన్‌బీఎఫ్‌సీలు ఎవరికంటే...
నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) గృహ రుణాల విషయంలో బ్యాంకుల మాదిరి అంత కఠినంగా వ్యవహరించవు. 700కు దిగువన క్రెడిట్‌స్కోరు ఉన్న వారికి సైతం, ఇతర అర్హతల ఆధారంగా ఇవి రుణాలను అందిస్తుంటాయి. ఆదాయ ధ్రువీకరణల్లేని స్వయం ఉపాధిపై ఉన్న వారికి, తక్కువ ఆదాయ వర్గాలకు సైతం ఎన్‌బీఎఫ్‌సీల్లో రుణాలు లభిస్తాయి. పైపెచ్చు ఎన్‌బీఎఫ్‌సీల్లో గృహ రుణం కేవలం రోజుల వ్యవధిలో మంజూరవుతుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే రుణం పొందొచ్చు. అంటే బ్యాంకులతో పోలి్చనపుడు ఎన్‌బీఎఫ్‌సీల్లో వేగవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఆశించొచ్చు. కాకపోతే ఎన్‌బీఎఫ్‌సీల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. కనుక వడ్డీ రూపంలో కాస్త ఎక్కువ చెల్లించాలి. బ్యాంకుల్లో మాదిరి అధిక రుణం మొత్తం అన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో సాధ్యపడదు.
వీరికి బ్యాంక్ బెటర్..
→ మంచి క్రెడిట్ స్కోరు ఉండి, ఆదాయ ధ్రువీకరణలున్న వారికి.
→ ఆర్‌బీఐ నియత్రణల కింద మరింత పారదర్శకత కోరుకునే వారికి.
→ సమయం పట్టినా తక్కువ వడ్డీకి రుణం కావాలనుకునేవారికి.
వీరికి ఎన్‌బీఎఫ్‌సీలు..
→ తక్కువ ఆదాయం లేదా ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం వచ్చేవారికి
→ వేగంగా రుణం మంజూరు కోరుకునే వారికి. ళీ వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా.. తమ అవసరాలకు వీలుగా సౌకర్యవంతమైన షరతులపై రుణం కోరుకునే వారికి
బంగారంపై రుణం ఎక్కడ నయం?
గృహ రుణం మాదిరే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణమూ సెక్యూర్డ్ కిందికే వస్తుంది. కనుక వీటిపైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ రుణం మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, చెల్లింపుల్లో సౌలభ్యం పరంగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి.
బ్యాంక్‌లు ఎక్కడ బెటరంటే...
→ బంగారంపై వడ్డీ రేటు బ్యాంకుల్లో తక్కువ. ఇవి 8 శాతం రేటుకే రుణాలిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ రేటు గరిష్టంగా 12 శాతం వరకు ఉంటుంది.
→ బంగారంపై బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. రుణం తీసుకుని, ప్రతి నెలా చెల్లింపులు చేయకుండా.. ఒకేసారి తిరిగి చెల్లించేట్టయితే ఏడాది కాలానికి మంజూరు చేస్తారు.
→ రుణం తీసుకుని నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించేట్టు అయితే రెండు నుంచి మూడేళ్ల కాలానికి రుణాలిస్తారు.
→ ఇక బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులైతే బంగారంపై తక్కువ రేటుకు రుణాలిస్తుంటాయి.
→ ఆర్‌బీఐ మార్గదర్శకాలను బ్యాంకులు కచి్చతంగా అనుసరిస్తుంటాయి. కనుక భద్రత, పారదర్శకత ఎక్కువ.
→ బ్యాంకుల్లో బంగారంపై రుణం అదే రోజు, గంటల్లోనే మంజూరవుతుంది.
→ కాకపోతే బ్యాంకుల్లో బంగారం విలువపై తక్కువ రుణం లభిస్తుంది. అంటే ఎక్కువ బ్యాంకులు బంగారం విలువలో 65–70 శాతానికి మించి రుణాన్ని ఇవ్వవు.
ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కడ బెటరంటే...
→ ఎన్‌బీఎఫ్‌సీల్లో బంగారం రుణాలపై అధిక వడ్డీ రేటు అమలవుతుంది. వీటిల్లో 12 శాతం నుంచి 30 శాతం మధ్య రేటు ఉంటుంది.
→ కేవైసీ పరంగా ఆధార్, పాన్ ఇస్తే చాలు... బ్యాంకుల్లో మాదిరే బంగారంపై రుణం అదే రోజు వేగంగానే మంజూరవుతుంది.
→ ముఖ్యంగా బంగారంపై అధిక రుణాన్ని ఎన్‌బీఎఫ్‌సీలు ఆఫర్ చేస్తుంటాయి. కానీ, ఇందుకోసం అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సిందే.
→ వడ్డీని ఏ నెలకానెల కట్టేసి.. అసలును చివర్లో కట్టేస్తే సరిపోతుంది.
→ కాకపోతే వీటిల్లో రుణ కాలవ్యవధి బ్యాంకుల్లో మాదిరి సుదీర్ఘంగా ఉండదు. ఆరు నెలలు, ఏడాదికే ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి.
→ రుణాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తాయి.
అంగీకారానికి ముందు..
→ రుణం తీసుకునే ముందు ఒప్పంద నియమ నిబంధనలు, షరతులు, చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
→ తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఆప్షన్లను తెలుసుకోవాలి.
→ రుణాన్ని నిరీ్ణత కాల వ్యవధికి ముందే తీర్చివేస్తే పెనాల్టీ మాదిరి ఏవైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? అడగాలి.
→ వివిధ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య రుణ రేట్లు, చార్జీలను పోల్చి చూసుకోవాలి.
→ సాధారణంగా దీర్ఘకాల రుణాలకు బ్యాంక్‌లు అనుకూలం, సౌకర్యం.
→ అత్యవసరంగా, అధిక రుణం కోరుకునే వారికి ఎన్‌బీఎఫ్‌సీలు అనుకూలం.
రుణ వ్యయాలు తగ్గించుకోవడమెలా?
→ రుణం తీసుకోవడానికి ముందు తమ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారి క్రెడిట్ స్కోరును ఆయా సంస్థలు ఉచితంగా ఇస్తాయి.
→ 760కు పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారు తక్కువ వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కోసం డిమాండ్ చేయొచ్చు.
→ గృహ రుణం అయితే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ (ఆర్‌బీఐ రెపో/ఈబీఎల్‌ఆర్) రేటు ఆధారితంగా ఎంపిక చేసుకోవాలి.
→ రుణం తీసుకునే సమయంలో అధిక రేటు ఉండి, ఆ తర్వాత రేట్లు దిగొస్తే.. మిగిలిన బకాయిని తక్కువ రేటు ఉన్న సంస్థకు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి.
Tags : 1