ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి
Published on Sun, 12/14/2025 - 06:18
ముంబై: పండగ సీజన్ తర్వాత కూడా ప్యాసింజర్ వాహనాలకు (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) డిమాండ్ కొనసాగింది. ఈ నవంబర్‌లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్‌లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది.
∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్‌లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్‌సైకిల్ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్ సిగ్మెంట్‌లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి.
‘‘పండుగ డిమాండ్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్‌లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్ సెంటిమెంట్‌తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ రాజేశ్ మీనన్ తెలిపారు.
Tags : 1