గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
Published on Wed, 11/19/2025 - 14:07
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.
ఆఫ్లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.
“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.
ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్‌ను డాక్యుమెంట్‌గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.
ఆధార్ కొత్త యాప్ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది.
Tags : 1