వీఆర్ఓపై మాధవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు
Breaking News
ధరలు.. దిగొచ్చాయ్!
Published on Tue, 07/15/2025 - 01:38
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహార ధరలు మరింత దిగొచ్చాయి. ఫలితంగా జూన్‌లో వినియోగ ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం/సీపీఐ) 2.1 శాతానికి దిగొచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతం కాగా, గతేడాది జూన్‌లో 5.08 శాతంగా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసింది.
చివరిగా 2019 జనవరిలో నమోదైన 1.97 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం గత కనిష్ట స్థాయిగా ఉంది. కూరగాయలు, పప్పులు, మాంసం, చేపలు, ధాన్యాలు, చక్కెర, పాలు, పాల ఉత్పత్తులు, దినుసుల ధరలు దిగిరావడమే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు వచ్చేందుకు సాయపడినట్టు ఎన్‌ఎస్‌వో తెలిపింది. ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 1.06 శాతానికి క్షీణించింది. ఈ ఏడాది మే నెలతో పోల్చి చూస్తే 2 శాతం దిగొచ్చింది.
మైనస్‌లోకి టోకు ద్రవ్యోల్బణం...
జూన్ నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం (టోకు ధరల సూచీ/డబ్ల్యూపీఐ) ఏకంగా ప్రతికూల స్థాయికి పడిపోయింది. మైనస్ 0.13 శాతంగా నమోదైంది. 19 నెలల తర్వాత మళ్లీ ప్రతికూల స్థాయికి చేరింది. ఆహారోత్పత్తులు, మినరల్ ఆయిల్స్, ఇంధనాలు, బేసిక్ మెటల్స్, తయారీ ఉత్పత్తుల వ్యయాలు దిగిరావడం ఇందుకు దారితీసింది. ఈ ఏడాది మే నెలకు టోకు ద్రవ్యోల్బణం 0.39 శాతం కాగా, గతేడాది జూన్ నెలలో 3.43 శాతం చొప్పున ఉంది.
Tags : 1