తీన్మార్ మల్లన్న నాపై అసభ్య కామెంట్స్ చేశారు: ఎమ్మెల్సీ కవిత
Breaking News
ఎల్‌ఐసీలో మరింత వాటా అమ్మకం
Published on Sat, 07/12/2025 - 04:35
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ)లో ప్రభుత్వం మరికొంత వాటా విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌ఐసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. 2022 మే నెలలో పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించిన సంగతి తెలిసిందే.
తద్వారా షేరుకీ రూ. 949 ధరలో రూ. 21,000 కోట్లు సమీకరించింది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం 2027 మే 16కల్లా ఎల్‌ఐసీలో పబ్లిక్‌కు కనీసం 10 శాతం వాటాను కలి్పంచవలసి ఉంది. దీంతో ఎల్‌ఐసీలో ప్రభుత్వం కనీసం 6.5 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రభుత్వం వాటా విక్రయానికి తెరతీయవచ్చని పేర్కొన్నాయి.
అయితే ఎంత వాటా.. ఎప్పుడు ఎలా విక్రయించాలనే అంశాలపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ ప్రణాళికలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలియజేశాయి. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే వీలున్నట్లు వివరించాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయిన పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ. 5.85 లక్షల కోట్లుగా నమోదైంది.
బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 927 వద్ద ముగిసింది.
Tags : 1