73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
హనుమ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం
Published on Thu, 05/22/2025 - 07:23
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్నీ, నిరాశానిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి... ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితం చేయగలిగే వాక్పటుత్వం... ఇవన్నీ కలబోసుకున్న ఒక విశిష్ఠ వ్యక్తి హనుమ. కేవలం ఆయనను దైవంగా పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆయన బుద్ధిబలం, దేనినైనా సాధించి తీరాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యం, దేహ దారుఢ్యం వంటి వాటిని అలవరచుకోగలగాలి. నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఆయనలోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చర్చించుకుందాం.
జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరం మీద నుంచి చూసి భయపడిపోతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు హనుమ ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకోవాలనే పాఠం చెప్పే గురువుగా.. మంత్రిగా... సన్మిత్రుడిగా దర్శనమిస్తాడు. ‘సుగ్రీవా! నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని భయపడితే ఎలాగయ్యా.. నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?‘ ఈ విధంగా హనుమ తొలిసారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.
సమయోచిత వేష భాషలు
ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక యతి వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! తాను స్వతహాగా అత్యంత శక్తిమంతుడైనా వ్యక్తి కంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవునితోనే వుంటాడు ఆంజనేయుడు.
అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు. హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి ‘‘చూశావా లక్ష్మణా, ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటం అదరడం లేదు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని అనవసరంగా కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు’’ అని రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో చెబుతాడు. అంటే దీనిని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.
ఆయన జీవితమే ఓ పాఠ్యపుస్తకం
నేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమకు అప్పగించిన పనినే తీసుకోండి. సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. అంటే సవాళ్లను స్వీకరించి వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అనే అంశాన్ని నేర్చుకోవడానికి హనుమ జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ.
వినయగుణ సంపన్నుడు
సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమ ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి ΄÷మ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.
కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం ఇది ఒక గొప్ప కళ. అశోక వనంలో సీతతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.
సమర్థుడైన కార్యసాధకుడు
ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతిమ విజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవ తీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించే అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగడం ఒక సమర్థుడైన కార్యసాధకుడి లక్షణం. హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాస లక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా.
సంభాషణా చతురుడు
లంక నుంచి తిరిగి వచ్చిన తరువాత దూరంనించే ‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవారికి ఆందోళన. పెరిగిపోవడం ఖాయం. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాతుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమ దగ్గర. ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితుల ్రపాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం.
– డి.వి.ఆర్.
Tags : 1