టోకెన్లతోనే సరి | Sakshi
Sakshi News home page

టోకెన్లతోనే సరి

Published Fri, Oct 6 2023 1:57 AM

Scholarships Fee Reimbursement Bills not issued - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్‌లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్‌లో జనరేట్‌ అయ్యి టోకెన్‌ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్‌ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి.  

దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... 
పోస్టుమెట్రిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. 

అవన్నీ రెండేళ్ల కిందటివే... 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్‌ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్‌ చేస్తారు.

అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్‌లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్‌ ‘సాక్షి’తో అన్నారు. 

Advertisement
Advertisement