మరో క్రికెట్‌ లీగ్‌కు విస్తరించనున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ | Sakshi
Sakshi News home page

మరో క్రికెట్‌ లీగ్‌కు విస్తరించనున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌

Published Thu, May 9 2024 6:41 PM

SA20 To Consider Adopting Impact Player Rule

ఐపీఎల్‌లో అమల్లో ఉన్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన త్వరలో మరో పాపులర్‌ క్రికెట్‌ లీగ్‌కు విస్తరించనుందని తెలుస్తుంది. 2023 ఐపీఎల్‌ సీజన్‌లో తొలిసారి పరిచయం చేయబడిన ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ 2025 ఎడిషన్‌ నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ రూల్‌కు ఆమోదం లభిస్తే ఐపీఎల్‌ తరహా మెరుపులు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ చూసే అవకాశం ఉంటుంది.

వాస్తవానికి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన గతేడాదే అమల్లోకి రావాల్సి ఉండింది. అయితే ఈ రూల్‌ గురించి చర్చ జరిగే సమయానికి అన్ని ఫ్రాంచైజీలు జట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ అమల్లో ఉంటే జట్ల ఎంపిక వేరేలా ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రాంచైజీలు అప్పట్లో దీనికి నో చెప్పాయి. 

ఈ రూల్‌ వల్ల ఐపీఎల్‌ రక్తి కడుతుండటంతో తాజాగా సౌతాఫ్రికా లీగ్‌ దీన్ని పునఃపరిశీలనలోకి తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తుంది.

ఇదిలా ఉంటే, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల అదనపు ఆటగాడిని ఆడించొచ్చనే మాట తప్పితే పెద్దగా ప్రయోజనాలేమీ లేకపోగా చాలా మైనస్‌లు ఉన్నాయి. ఈ రూల్‌ వల్ల సంప్రదాయ క్రికెట్‌ చచ్చిపోతుందని చాలా మంది దిగ్గజాలు ఆరోపిస్తున్నారు.  రూల్‌ వల్ల ఆల్‌రౌండర్ల భవిష్యత్తు  ప్రశ్నార్దకంగా మారుతుందని అంటున్నారు. 

ఈ రూల్‌ అమల్లో ఉంటే బ్యాటర్‌ లేదా బౌలర్‌వైపే మొగ్గు చూపుతారు కాని ఆల్‌రౌండర్లను పట్టించుకోరని వాదిస్తున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై రోహిత్‌ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్‌ కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆటను రక్తి కట్టించడం కోసం ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను ఐపీఎల్‌లో అమలు చేస్తుంటే దీని ప్రభావం జాతీయ జట్టు ఆల్‌రౌండర్లపై పడుతుందని అన్నాడు. శివమ్‌ దూబే లాంటి ఆల్‌రౌండర్లు కేవలం​ బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతున్నారని వాపోయాడు. జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా ప్రమాదమైన నిబంధన అని తెలిపాడు.

కాగా, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన అమల్లో అంటే రెగ్యులర్‌ క్రికెట్‌కు భిన్నంగా 11 మందితో కాకుండా 12 మంది ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశం ఉంటుంది. అవసరాల దృష్ట్యా స్పెషలిస్ట్‌ బ్యాటర్‌లో లేదా స్పెషలిస్ట్‌ బౌలర్‌లో జట్లు బరిలోకి దించుతాయి. దీని వల్ల ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతుంది. వీరికి పెద్దగా అవకాశాలు రావు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement