అకౌంటెంట్‌ సిరిల్‌పాల్‌పై విచారణకు ఆదేశం | Sakshi
Sakshi News home page

అకౌంటెంట్‌ సిరిల్‌పాల్‌పై విచారణకు ఆదేశం

Published Mon, May 20 2024 10:10 AM

-

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): నగరపాలక సంస్థలో 2022లో కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లులను తన బినామీ ఖాతాలకు మళ్లించి సస్పెండ్‌ అయిన అకౌంటెంట్‌ సిరిల్‌పాల్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. 2020లో ఓ కాంట్రాక్టర్‌ చేసిన అభివృద్ధి పనులకు చెక్కులు తయారు చేసిన అకౌంట్‌ సెక్షన్‌ ఆ చెక్కులను పలు బినామీ ఖాతాలకు మళ్లించింది. ఈ విషయం 2022 నవంబర్‌లో బయటకు పొక్కింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషనర్‌ కీర్తి చేకూరి రూ.అర కోటి వరకు దారి మళ్లించారని తేలడంతో అప్పట్లో అకౌంటెంట్‌గా పనిచేసిన సిరిల్‌పాల్‌ను సస్పెండ్‌ చేయడంతో అతనిపై సైబర్‌ క్రైమ్‌ నేరంగా లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ఇంకా దీనిపై పూర్తి విచారణ చేసి ఎంత మొత్తంలో అవినీతి జరిగిందో లెక్క తేల్చడానికి స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ వారికీ అప్పట్లో కమిషనర్‌ కీర్తి చేకూరి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సిరిల్‌పాల్‌పై చర్యలు లేకపోవడంతో ఓ వ్యక్తి ఏప్రిల్‌ 26న ప్రభుత్వానికి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. దీంతో సిరిల్‌పాల్‌పై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి వివరాలతో నివేదిక అందించాలని ఇటీవల మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అదనపు కార్యదర్శి ఎం.ప్రతాప్‌రెడ్డి సీడీఎంఏ(కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌)ని ఆదేశించారు. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై సీడీఎంఏ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

నగరపాలక సంస్థలో రూ.అరకోటి దారి మళ్లింపు వ్యవహారంలో కీలకమలుపు గతంలోనే సిరిల్‌ని సస్పెండ్‌ చేసి,కేసు నమోదు చేసిన నగర కమిషనర్‌ తాజాగా ఓ వ్యక్తి ఫిర్యాదుతో ప్రభుత్వం చర్యలు విచారణాధికారిగా సీడీఎంఏ నియమించాలని ఆదేశం

Advertisement
 
Advertisement
 
Advertisement