Resignations Continue In Kaikaluru TDP - Sakshi
Sakshi News home page

టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం  

Published Thu, Feb 16 2023 11:26 AM

Resignations Continue In Kaikaluru Tdp - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కైకలూరు నియోజకర్గ టీడీపీలో కల్లోలం రేగింది. ప్రస్తుతం ఇన్‌చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి అధికార వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకోనుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేడర్‌ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనస్త్రాలు సంధించింది.

మరోవైపు ఇన్‌చార్జిగా ఎవరినైనా కొంతకాలం పెట్టి పార్టీని నడపడానికి సన్నాహాలు చేస్తున్నా, ఇన్‌చార్జి పదవికి ముఖ్యులంతా ముఖం చాటేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ డైలామాలో పడింది. ఇప్పటికే టీడీపీ రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ గురువారం వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.

హడావుడిగా టీడీపీ నేతల భేటీ 
దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో జయమంగళ వెంకటరమణ క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా నియోజకవర్గంలో పట్టు ఉండటంతో 1998లో కైకలూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పార్టీ అంతర్గత వెన్నుపోట్లతో టికెట్‌ కోల్పోయారు. మళ్ళీ 2019లో చివరి నిమిషంలో టికెట్‌ ఇచ్చినా నియోజకవర్గంలో వెన్నుపోటు రాజకీయాలతో ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో అనేక హామీలు, పార్టీపరంగా రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పినప్పటికీ ఆయనను పూర్తిగా విస్మరించారు. దీంతో టీడీపీ తీరుపై విరక్తి చెంది పార్టీకి రాజీనామా ప్రకటించడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. బుధవారం హడావుడిగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఏర్పాటు చేశారు. అది కాస్తా రసాభాసగా సాగింది.

నేతలతో వాగ్వాదం:
దీంతో కేడర్‌ను కాపాడుకోడానికి మాగంటి బాబు, ఏలూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొర్రా చలమయ్యలు సమావేశానికి హాజరయ్యారు. ప్రారంభంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు జానీకి కనీసం వేదికపై చోటు ఇవ్వకపోవడంతో నిలదీశారు. అతనికి మద్దతుగా రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి జె.ఎస్‌.మాల్యాద్రి వేదికపై నాయకులను ప్రశ్నించారు. దీంతో గన్ని వీరాంజనేయులు సర్ధిచెప్పారు. సమావేశం అనంతరం జానీ, మాల్యాద్రిలు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుకు ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపధ్యంలో కమ్మిలి విఠల్, జానీ, మాల్యాద్రిల మధ్య మాటల యుద్ధం జరిగింది.

పోటీ కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిక 
వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్న జయమంగళ ప్రధాన అనుచరులను పొమ్మనలేక పొగబెడుతున్నారని జానీ, మల్యాద్రి మండిపడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తే ఇప్పుడు గెంటేయడానికి ప్రయత్ని స్తున్నారన్నారు. ఇలాగైతే టీడీపీలో విడిగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ.. మీది నాతో మాట్లాడే స్థాయి కాదని, నా మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు జానీ, మాల్యాద్రి    

కొనసాగుతున్న రాజీనామాల పర్వం  
తెలుగుదేశం పార్టీకి కైకలూరు నియోజకవర్గంలో కాలం చెల్లే పరిస్థితి దాపరించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పారీ్టకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని మంగళవారం ప్రకటించిన విషయం విధితమే. అదే బాటలో టీడీపీ రైతు అధికార ప్రతినిధి సయ్యపురాజు గుర్రాజు పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు లేఖ పంపారు. జయమంగళతో పాటు వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నట్లు స్థానికలతో చెప్పారు. గుర్రాజు బాటలోనే మరికొందరు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి త్వరలో రానున్నట్లు సమాచారం.   

డీఎన్నార్‌ను కలిసిన జయమంగళ
వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌)ను బుధవారం ఆయన మర్వాదపూర్వకంగా కలిశారు. డీఎన్నార్‌కు జయమంగళ పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ముందుగా డీఎన్నార్‌ మాట్లాడుతూ జయమంగళ వెంకటరమణ టీడీపీ పాలనలో అణచివేతకు గురైన బీసీ నాయకుడన్నారు.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి జయమంగళ పేరును ఎమ్మెల్సీగా సూచించామన్నారు. కొల్లేరు అభివృద్ధికి సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. జయమంగళ రాకతో కొల్లేరు ప్రజలకు మరింత చేరువగా పథకాలను అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మాట విని టిక్కెట్టును కామినేని శ్రీనివాస్‌కు త్యాగం చేశానన్నారు.

తనకు మొదటి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి కొల్లేరు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. నేడు సీఎం జగన్‌ కొల్లేరు రీసర్వే, రెగ్యులేటర్ల నిర్మాణం, పెద్దింట్లమ్మ వారధి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. భవిష్యత్తులో డీఎన్నార్‌ భారీ మెజారి్టఈతో ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు.

కొల్లేరులంక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వైఎస్సార్‌సీపీ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు జయమంగళ తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే డీఎన్నార్‌ కుమారులు వినయ్, శ్యామ్‌కుమార్, టీడీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు సయ్యపురాజు గుర్రాజు ఉన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement