బీ ఫాం నాదే: రాజయ్య సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

బీ ఫాం నాదే.. అది కాలమే నిర్ణయిస్తుంది.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Published Sun, Sep 24 2023 6:42 PM

BRS MLA Thatikonda Rajaiah Sensational Comments About KTR Meet - Sakshi

సాక్షి, జనగామ జిల్లా: కేటీఆర్‌ చొరవతో.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న సమయంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాంబు పేల్చారు. బీ ఫాం తనదేనని ప్రకటించుకున్న ఆయన.. ఒకవేళ సీటు కేటాయించని పక్షంలో పోటీ చేసే విషయం కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.  ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసిపోయారనుకునేలోపే ఎమ్మెల్యే రాజయ్య బాంబు పేల్చడం గమనార్హం.

లింగాలగణపురం మండలం వడ్డీచర్లలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పుకొట్టి దరువేశారు. డప్పు, డోలు కొట్టి కార్యకర్తలను ఉత్సాహాపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు టికెట్‌ నీకే అని చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్‌ లేకపోవడంతో మళ్లీ రెండు రోజుల క్రితం సమావేశమైనట్లు చెప్పారు.

తనకు ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా కానీ అవకాశం ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు.  అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మని చెప్పారని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న  ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫోటోకు ఊహాగానాలతో మీడియాలో వచ్చిన కథనాలతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందన్నారు ఎమ్మెల్యే రాజయ్య.

కడియంతో ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. సర్వే రిపోర్ట్‌లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీఫామ్‌లు ఇవ్వలేదన్న రాజయ్య..  కొన్ని నియోజక వర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయని తెలిపారు.

‘2014లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా నేను అధిష్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేశాం. ఇప్పుడు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తా.  జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటా. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కార్యకర్తలు ఆందోళన చెందకుండా పని చేయండి. వరంగల్‌లో దామోదర రాజనర్సింహతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్‌లోకి వెల్తున్నారని కథనాలు రాశారు. ఊహాగానాలతో మీడియాలో కథనాలు రాయడాన్ని  ఖండిస్తున్నాను’ అని రాజయ్య పేర్కొన్నారు. 

Advertisement
Advertisement