Those Who Feed Stray Dogs Liable For Attacks Says Supreme Court - Sakshi
Sakshi News home page

వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాస్తవమెంతంటే..

Published Sat, Sep 10 2022 5:44 PM

Who Feed Stray Dogs Liable For Attacks Says Supreme Court fake - Sakshi

ఢిల్లీ: వీధి కుక్కలను ఆదరించేవాళ్లకు సుప్రీం కోర్టు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిందంటూ ఓ కథనం జాతీయ మీడియా వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. ప్రతీరోజూ వాటికి తిండిపెట్టడమే కాదు.. వ్యాక్సినేషన్‌ వేయించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని గుర్తు చేసిందంటూ, ఒకవేళ అవి గనుక ఎవరినైనా కరిస్తే,  ఆ పరిణామాలకూ వాటిని ఆదరించేవాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిందన్నది ఆ కథనాల సారాంశం. 

మూగజీవాల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపిందని, వీధికుక్కలను ఆదరించి.. తిండి పెట్టేవాళ్లూ వాటి బాధ్యతలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని,  ఒకవేళ అవి ఎవరి మీదైనా దాడి చేస్తే గనుక.. ఆ ఘటనలకు వాళ్లే బాధ్యలవుతారు అంటూ బెంచ్‌ పేర్కొందని కథనం కొన్ని జాతీయ మీడియా ఛానెల్స్‌ ద్వారా ప్రముఖంగా వైరల్‌ అయ్యింది. అయితే.. ఈ కథనంలో వాస్తవం లేదన్న విషయం ఇప్పుడు తేలింది. 

ఎంపీ, జంతు పరిరక్షణ సమితి సభ్యురాలు మేనకా గాంధీ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయస్థానంగానీ,  ఏ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం దురుద్దేశంతోనే కొందరు అలా ప్రచారం చేస్తు‍న్నారని ఆమె ఆ వీడియోలో స్పష్టత ఇచ్చారు. కాబట్టి, వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. 

ఇదిలా ఉంటే.. 2019 నుంచి దేశంలో 1.5 కోట్ల మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో కేసులు, ఆపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పెంపుడు కుక్కలంటే.. వీధికుక్కల దాడులే ఎక్కువగా ఉన్నాయి. కేరళ, ముంబైలలో పెనుముప్పుగా మారిన వీధికుక్కల దాడులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వ సంబంధిత పౌర విభాగాలు.. వాటిని చంపించడంపై దృష్టిసారించాయి.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో పలు పిటిషన్లు నమోదుకాగా.. వాటిని కోర్టులు తోసిపుచ్చాయి. దీంతో మూగజీవాల సంరక్షణ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. ఒక బ్యాచ్ పిటిషన్లను విచారిస్తోంది అత్యున్నత న్యాయస్థానం. తాజా విచారణ సందర్భంగా.. సెప్టెంబర్‌ 28కి తదుపరి విచారణ వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే.. దేశంలో మణిపూర్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలిలో వీధి కుక్కల సంఖ్య సున్నాగా ఉందని అక్కడి అధికార యంత్రాంగాలు ప్రకటించుకున్నాయి.

ఇదీ చదవండి: జొమాటో డెలివరీ బాయ్‌పై కుక్క దాడి.. వీడియో వైరల్‌

Advertisement
Advertisement