Director Puri Jagannadh Released Letter To Media About Liger Issue - Sakshi
Sakshi News home page

Puri Jagannadh : 'పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు.. ఏదీ పర్మినెంట్‌ కాదు'..

Published Sun, Oct 30 2022 11:49 AM

Director Puri Jagannadh Released Letter To Media About Liger Issue - Sakshi

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లైగర్‌ ఫ్లాప్‌ కావడంతో  బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయడమే కాకుండా, పూరిని బెదిరిస్తూ ధర్నాకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పూరి తమ ఫ్యామిలీకి ముప్పు ఉందని రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిణామాలపై పూరి జగన్నాథ్‌ మీడియాకు లేఖను విడుదల చేశారు. 'నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్‏ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా.వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తా' అంటూ సుధీర్ఘ నోట్‌లో రాసుకొచ్చారు.

పూరి లేఖ పూర్తి సారాంశం..
”సక్సెస్.. ఫెయిల్యూర్.. ఈ రెండూ అపోజిట్ అనుకుంటాం. కానీ కాదు. ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక తర్వాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే.. ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్‏పీరియన్స్ లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు.

నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ పెరుగుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు. ఇక బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. జీవితంలో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు.

ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. జీవితంలో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ జీవితంలో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది.

 నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులని ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి నేను ప్రేక్షకుల పట్ల బాధ్యత వహిస్తాను. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా”.. – మీ పూరి జగన్నాధ్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement