చెంగల్రాయుడును అరెస్ట్‌ చేయాలి  | Sakshi
Sakshi News home page

చెంగల్రాయుడును అరెస్ట్‌ చేయాలి 

Published Wed, Nov 23 2022 4:11 AM

Lawyers Complaints against Chengal Rayudu and Chandrababu - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/విజయవాడ స్పోర్ట్స్‌/సాక్షి, భీమవరం/ఉండి/నెల్లూరు(లీగల్‌): రాజ్యాంగబద్ధమైన పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది.

ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను తిడుతూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయన ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు, పోలీసు, న్యాయ వ్యవస్థలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చెంగల్రాయుడు లాంటి వ్యక్తులను చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు.

ఇటీవల కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం పోలీసు వ్యవస్థపై పరుష పదజాలంతో నిరాధారమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో పోలీసులను కట్టు బానిసలుగా అభివర్ణించారని, దానిని కూడా ఖండిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు.

పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి విధులు నిర్వహించడంలో మాత్రమే కట్టు బానిసలుగా ఉంటారని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థ మీద విమర్శలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు ఆర్‌.రఘురాం, సీఐడీ యూనిట్‌ అధ్యక్షుడు అక్కిరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వరరావు, సభ్యుడు సత్యారావు, విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. 

చెంగల్రాయుడు, చంద్రబాబుపై విజయవాడలో సీపీకి న్యాయవాదుల ఫిర్యాదు  
న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచేలా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణాకు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడును ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జి.నాగిరెడ్డి, పి.నిర్మల్‌ రాజేష్, జె.జయలక్ష్మి, నరహరిశెట్టి శ్రీహరి, కె.వెంకటేష్‌శర్మ, గవాస్కర్, జి.కిరణ్, ఎస్‌.పరమేష్, బసవారెడ్డి, పి.రాంబాబు, కె.ప్రభాకర్, బి.రమణి, అల్లాభక్షు, ఎం.విఠల్‌రావు, ఎన్‌.కోటేశ్వరరావు, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.  

పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు  
చెంగల్రాయుడు, చంద్రబాబుపై భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో, పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్‌ స్టేషన్‌లో, ఏలూరులో, నెల్లూరులోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో, తిరుపతిలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ వ్యవస్థ, పోలీసులను కించపరిచేలా చెంగల్రాయుడు వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement