ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్‌ అధికారి | Finance Department Section Officer Caught Accepting Bribe By ACB In Amaravati - Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్‌ అధికారి

Published Sat, Nov 25 2023 2:58 AM

Finance department section officer caught by ACB - Sakshi

సాక్షి, అమరావతి/నగరంపాలెం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ(సంక్షేమ విభాగం–2) సెక్షన్‌ అధికారి ఒంటెద్దు నాగభూషణ్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగరం కొరిటెపాడులోని గౌతమినగర్‌ 4వ వీధికి చెందిన ఒంటెద్దు నాగభూషణరెడ్డి వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ భవనం–2 (సంక్షేమం–2)లో సెక్షన్‌ అధికారిగా ఉన్నారు.

మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి కర్నూలులోని బాలాజీనగర్‌కు చెందిన మహమ్మద్‌ నదీమ్‌ హుస్సేన్‌ తన కుమారుడు అజంతుల్లా షరీఫ్‌ కోసం దరఖాస్తు చేశారు. దీంతో అజంతుల్లా షరీఫ్‌కు సుమారు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన ఉపకార వేతనం విడుదల చేసేందుకు సెక్షన్‌ అధికారి నాగభూషణరెడ్డి దరఖాస్తుదారు మహమ్మద్‌ నదీమ్‌ హుస్సేన్‌ను రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు కర్నూలు జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదును బదలాయించారు.

ఈ క్రమంలో మహమ్మద్‌ నదీమ్‌ హుస్సేన్‌ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు నాగభూషణరెడ్డికి సచివాలయ ఆవరణలోని పార్కింగ్‌ ప్రదేశంలో రూ.40 వేలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్యాంట్‌ జేబులోని డబ్బులను స్వా«దీనం చేసుకున్నారు. నాగభూషణ్‌ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు తొలుత రూ.10 వేలు ఫోన్‌ పే చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement