జ్యూస్‌ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్‌? | Sakshi
Sakshi News home page

జ్యూస్‌ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్‌?

Published Sat, Sep 16 2023 4:12 PM

Mahadev App scam star studed UAE Wedding Who Is Sourabh Chandrakar - Sakshi

Mahadev Gambling App Sourabh Chandrakar: మహదేవ్ బెట్టింగ్ యాప్‌ కుంభకోణానికి  సంబంధించి  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  (ఈడీ) ఇటీవల నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈడీ దాడుల్లో రూ.417 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాయ్‌పూర్, భోపాల్, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన 39 ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ 15 మందిని అరెస్టు చేయడంతో మహాదేవ్‌ బుక్‌ యాప్‌ అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 

దుబాయ్‌లో ఉంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నసౌరభ్ చంద్రకర్ ఈ స్కాంలో కీలకం. మహాదేవ్ ఆన్‌లైన్ బుకింగ్ పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్‌లు, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఇతర ఆటల ద్వారా అక్రమ బెట్టింగ్  నిర్వహిస్తుంది. ఈ బెట్టింగ్‌ యాప్‌లో సహ ప్రమోటర్‌గా ఉన్న  రవి ఉప్పల్  కలిసి బెట్టింగ్  ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను FPI మార్గం ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో దుబాయ్‌లో ఈ ఇద్దరు ప్రధాన ప్రమోటర్లు రూ. 5,000 కోట్ల వరకు కూడబెట్టారు. (బాలీవుడ్‌లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్‌)

రూ. 200 కోట్ల స్టార్-స్టడెడ్ వివాహం
ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరభ్‌ దుబాయ్‌లోని  అతిపెద్ద నగరంలో, అత్యంత విలాసవంతంగా వివాహం చేసుకున్నాడు. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేశాడు. నాగ్‌పూర్ నుండి తన బంధువులను, సినీ తారలను ప్రైవేట్ జెట్‌ల ద్వారా తరలించాడు. అంతేకాదువెడ్డింగ్ ప్లానర్‌కు రూ.120 కోట్లు చెల్లించాడు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పెషల్‌ ప్రదర్శనలు ఇచ్చారంటే పెళ్లి ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అంగడియ సంస్థలు డబ్బును డెలివరీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో యోగేష్ భాపట్  ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ R-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.112 కోట్లు, హోటల్ బుకింగ్స్ కోసం రూ.42 కోట్లు అందాయి. భోపాల్‌కు చెందిన ర్యాపిడ్ ట్రావెల్స్ చంద్రకర్ బంధువులు, బాలీవుడ్‌ ప్రముఖులను దుబాయ్‌కు పంపడానికి టిక్కెట్లు ఏర్పాటు చేసిందని, అయితే కోల్‌కతాకు చెందిన వికాస్ చప్పరియా ద్వారా అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయని ఈడీ ఆరోపించింది. (ఐకానిక్‌ డబుల్‌ డెక్కర్‌: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్‌ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!)

ఈ వివాహానికి  బాలీవుడ్‌ సెలబ్రిటీలు అతిఫ్ అస్లాం, విశాల్ దద్లానీ, రహత్ ఫతే అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, అలీ అస్గర్, సన్నీ లియోన్, క్రిసీ ఖర్బండా, ఎల్లి అవ్రామ్, నుష్రత్ భరుచ్చా, భారతీ సింగ్, క్రుషా అభిషేక్,భాగ్యశ్రీ వంటి తారలు హాజరయ్యారని ఈడీ గుర్తించింది. వీరందరినుంచి సమన్లు జారీ చేసి, వారి స్టేట్‌మెంట్లు తీసుకోవాలని ఈడీ చూస్తోంది.సెప్టెంబర్ 18, 2022న జరిగిన మూడవ వార్షికోత్సవ పార్టీకి కూడా బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వీరిలో సంజయ్ దత్, కపిల్ శర్మ, అఫ్తాబ్ శివదాసాని, సుఖ్‌విందర్ సింగ్, సోఫీ చౌదరి, డైసీ షా, ఊర్వసాహి రౌతేలా, నర్గీస్ ఫక్రీ, నేహా శర్మ తదితరులు హాజరయ్యారు. ఈవెంట్ మేనేజర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులపై జరిపిన దాడుల్లో ఈ నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈడీ ఆరోపణల ప్రకారం వీరు మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బుక్‌ బెట్టింగ్‌ యాప్‌ గొడుగు కింద సిండికేట్‌ అయ్యారు.  ముఖ‍్యంగా  ఇన్‌యాక్టివ్ లేదా సెమీ-యాక్టివ్ ఖాతాలను గుర్తించి వారికి స్వల్పమొత్తంలో ఎరవేసి, ఆ ఖాతాల  ద్వారా కోట్ల లావాదేవీలు చేశారని దీంతోనే  వీటిని ట్రాక్‌ చేయడం కష్ట మైందని దర్యాప్తు ఏజెన్సీ చెప్పింది. 

జ్యూస్‌ అమ్ముకునే చంద్రకర్‌
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్ మొదట్లో జ్యూస్ అమ్మేవాడు. మరోవైపు రవి ఉప్పల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. స్థానిక బుకీలుగా ప్రారంభమై,  చాలా తక్కువ సమయంలోనే చంద్రకర్‌, రవి  ఇద్దరూ దుబాయ్‌కి వెళ్లి  2018లో ఈ యాప్‌ను ప్రారంభించారు. త్వరితగతిన డబ్బులిస్తామంటూ  విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఇతరులను ప్రలోభపెట్టారు. ఇది సక్సెస్‌ కావడంతో అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. సెలబ్రిటీల ద్వారా మహదేవ్ బుక్ యాప్స్‌ ప్రమోషన్స్‌ నిర్వహించింది.అలా కోట్లకు పడగలెత్తిన చంద్రకర్‌, FairPlay, Reddy Anna, Lotus365 వంటి బ్రాండ్‌లను కొనుగోలు చేసింది. దీంతోపాటు,  'బేట్‌భాయ్'  అంబానీ బుక్' పేరుతో కొత్త బ్రాండ్‌లను కూడా ప్రారంభించాడు. ఈ ఇద్దరు కింగ్‌పిన్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు (ఆర్‌సిఎన్) జారీ చేసే యోచనలో ఉందిఈడీ. దీని నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు పరారీలో ఉన్న నిందితులకు  నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది.
 

Advertisement
Advertisement