ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు | Sakshi
Sakshi News home page

ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు

Published Tue, Jul 11 2023 7:44 AM

Equity Mutual Fund Category Received Rs 8,637.49 Crore In June 2023  - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్‌ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్‌ఎఫ్‌వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్‌ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్‌క్యాప్‌ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్‌ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ప్రకటించింది.

ఈక్విటీ పథకాల్లోకి జూన్‌ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ మెల్విన్‌ శాంటారియా పేర్కొన్నారు.

జూన్‌ నెలలో 11 ఎన్‌ఎఫ్‌వోలు (ఓపెన్‌ ఎండెడ్‌) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్‌ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్‌ మహీంద్రా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సేల్స్‌ హెడ్‌ మనీష్‌ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్‌ అలోకేషన్‌ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌), సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. 

నికరంగా చూస్తే ఉపసంహరణే 
జూన్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్‌ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.  

విభాగాల వారీగా..  

స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 

సిప్‌ రూపంలో ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్‌ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి.  

లార్జ్‌క్యాప్‌ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్‌ ఫండ్స్‌ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. 

వ్యాల్యూ ఫండ్స్‌ రూ.2,239 కోట్లు, మిడ్‌క్యాప్‌ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. 

ఈటీఎఫ్‌ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి.  

అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్‌ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది.

డెట్‌ విభాగంలో హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

లిక్విడ్‌ ఫండ్స్‌ రూ.28,545 కోట్లు కోల్పోయాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement