సైబర్‌ వార్‌ఫేర్‌ను ఎదుర్కొనేలా మన ‘పవర్‌’ | Sakshi
Sakshi News home page

సైబర్‌ వార్‌ఫేర్‌ను ఎదుర్కొనేలా మన ‘పవర్‌’

Published Tue, May 30 2023 2:37 AM

Special protection system for the safety of power grids - Sakshi

సాక్షి, అమరావతి: దేశ విద్యుత్‌ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్‌ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం.

అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్‌ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్‌ గ్రిడ్‌ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్‌ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్‌ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్‌ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది.

మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్‌ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్‌ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది.

సైబర్‌ దాడులు దేశ విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  

సీఎస్‌ఐఆర్‌ టీమ్‌ ఏర్పాటు 
సైబర్‌ సెక్యూరిటీలో భాగంగా పవర్‌ ఐలాండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్‌ సెక్యూరిటీ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఎస్‌ఐఆర్‌టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్‌ (ఇంటర్నెట్‌) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్‌ ఈస్ట్రన్‌ అనే ఐదు ప్రాంతీయ పవర్‌ గ్రిడ్‌లు ఉన్నాయి.

వీటన్నిటినీ ‘వన్‌ నేషన్‌.. వన్‌ గ్రిడ్‌’ కింద సెంట్రల్‌ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్‌ గ్రిడ్‌ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్‌ ఐలాండ్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్‌ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్‌ ఐలాండింగ్‌ సిస్టమ్‌ అంటారు. దీనివల్ల పవర్‌ గ్రిడ్‌లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్‌మిషన్, డి్రస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్‌ చేయడం తేలికైంది.

దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌లో భాగమైన సదరన్‌ రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్‌ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్‌ మోడల్‌ను తీసుకుంది. విద్యుత్‌ సంస్థల్లో ఎక్కు­వ మంది సిబ్బంది విద్యుత్‌ కార్యకలాపాలను తమ సెల్‌ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్‌లో హానికర సాఫ్ట్‌వేర్‌ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. 

Advertisement
 
Advertisement