మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం

Published Sat, Aug 27 2022 8:46 AM

Minister Botsa Satyanarayana Meeting With CPS Employee Unions - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) ఉద్యోగులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ (గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం)ను ప్రతిపాదిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించారు.

అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చాం. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం. అందుకే సీపీఎస్‌ స్థానంలో అంతకంటే మెరుగైన జీపీఎస్‌ను ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు జీపీఎస్‌ వద్దు.. అవసరమైతే ఓపీఎస్‌ (ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం)లో కొన్ని అంశాలను సవరించమంటున్నారు. ప్రభుత్వం జీపీఎస్‌లో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తానంటోంది. త్వరలోనే రెండింటి మధ్య ఎక్కడోచోట సమస్య పరిష్కారమవుతుంది. అప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఎన్నిసార్‌లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’.. అని బొత్స అన్నారు.

జీపీఎస్‌లో అదనపు బెనిఫిట్స్‌ ప్రతిపాదించారు.. 
మంత్రుల కమిటీ ద్వారా పాత పెన్షన్‌ విధానంపై తీపికబురు వస్తుందనుకుంటే నిరాశే ఎదురైందని రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యమ వ్యవస్థాపకుడు పి. రామాంజనేయులు యాదవ్‌ అన్నారు. అయితే,  కొత్తగా జీపీఎస్‌లో హెల్త్‌ బెనిఫిట్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తామనడం సానుకూలంగా ఉందన్నారు. ఇక జీపీఎస్‌పై అయితే భవిష్యత్తులో చర్చలకు వచ్చేదిలేదని.. పాత పెన్షన్‌పై అయితేనే చర్చలకు వస్తామని ఆయన స్పష్టంచేశారు. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఓపీఎస్‌ను అమలుచేయమంటే జీపీఎస్‌పై చర్చిస్తున్నారన్నారు. దీంతో సెప్టెంబర్‌ 1న సీఎం ఇంటి ముట్టడిని చేపడతామన్నారు. 

ఎవరో పిలుపునిస్తే.. మేమా బాధ్యులమా?
ఇక సీపీఎస్‌ ఉద్యోగుల బ్లాక్‌ డే సందర్భంగా విజయవాడలో శాంతియుతంగా సభ పెట్టుకుంటామంటే.. ఎవరో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే.. తమ సంఘ నాయకులను బైండోవర్‌ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు అన్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. 

Advertisement
Advertisement