వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చు..! | Sakshi
Sakshi News home page

వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చు..!

Published Fri, Dec 26 2014 12:33 AM

Warner Brothers

భారత డ్రెస్సింగ్ రూం కథనాలపై ధోని వ్యాఖ్య
 రోజుకో రకం ఆరోపణలను ఖండించిన కెప్టెన్
 
 మెల్‌బోర్న్: రెండో టెస్టులో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి.. ఓపెనర్ శిఖర్ ధావన్‌ల మధ్య డ్రెస్సింగ్ రూంలో జరిగిన గొడవపై రోజుకో కథనాలు వెలువడడంపై భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అసలు వీటి ఆధారంగా హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ సినిమా తీయొచ్చని ఎగతాళిగా అన్నాడు. భారత జట్టులో వాతావరణం ప్రశాంతంగానే ఉందన్నాడు.
 
 గాబా టెస్టు నాలుగో రోజున ధావన్ గాయం కారణంగా ఆడలేనని చెప్పడంతో అప్పటికప్పుడు కోహ్లి బ్యాటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఉదంతంపై కోహ్లి అవుటైన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ధావన్‌తో గొడవ పడినట్టు కథనాలు వెలువడ్డాయి. ‘విరాట్ కోహ్లి కత్తి పట్టుకుని వచ్చి శిఖర్ ధావన్‌ను పొడి చాడు. కోలుకున్న ధావన్‌కు బ్యాట్ చేతికిచ్చి పంపాం’ అని మీడియా అడిగిన ప్రశ్నలకు ధోని వెటకారంగా సమాధానమిచ్చాడు. ఈ ఇద్దరి ఎపిసోడ్‌పై వస్తున్న కథనాలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశాడు. ‘ఇలాంటివన్నీ చదువుకోవడానికి ఆసక్తిగా ఉంటాయి.
 
 ఓ విధంగా అవి పత్రికల అమ్మకాలకు కూడా కారణమవుతాయి. వీటిని మార్వెల్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు తీసుకుని ఓ మాంచి సినిమా తీయొచ్చు. ఇలాంటివన్నీ ఎక్కడ నుంచి వస్తాయో అర్థం కాదు. భారత పర్యటనల సందర్భంగా జర్నలిస్టులు తమ సొంత కథనాలను సృష్టిస్తుంటారు. ఒకవేళ జట్టులోని ఆటగాడే ఇదంతా చె బితే అతడి పేరును బయటపెట్టండి.

ఎందుకంటే అతడి ఊహ నిజంగా అద్భుతం. కచ్చితంగా ఆ వ్యక్తి మా డ్రెస్సింగ్ రూంలో ఉండడం కంటే సినిమా కంపెనీలో పనిచేస్తేనే బావుంటుంది. అసలేమాత్రం జరగని విషయాన్ని జరిగినట్టు అల్లడం మామూలు విషయం కాదు. అందుకే అతడికి మా దగ్గర ఉండే అర్హత లేదు. వాస్తవం మాట్లాడదలుచుకుంటే ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు’ అని ధోని ఘాటుగాస్పం దించాడు. మరోవైపు గతవారంతో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న ధోని తన ఈ ప్రయాణంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఎలాంటి పరిస్థితిల్లోనైనా అణకువగా ఉండడం కోల్పోలేదని అన్నాడు.
 
 వారిని మేం తిట్టాల్సిన అవసరం లేదు: స్మిత్
 ప్రస్తుత పరిస్థితిలో భారత క్రికెట్ జట్టును తాము స్లెడ్జింగ్ చేయాల్సిన అవసరం లేనట్టుందని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఎగతాళి చేశాడు. ‘ఇప్పుడు భారత ఆటగాళ్లను మేం స్లెడ్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. వారిప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. ఒకరిపై ఒకరు గొడవకు దిగుతూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. వారంతా మాకోసమే చేస్తున్నారేమో. ఇప్పటిదాకా అయితే మేం మైదానంలో అలాంటి పని చేసేవారం. ఇప్పుడు భారత జట్టు వారి డ్రెస్సింగ్ రూంలో చేసుకుంటే అది వారిష్టం. ఈ వారం మేం వారికి అంతరాయం కలిగించం. ఇక ఆట పరంగా ఇప్పుడు ఆడుతున్నట్టే ఆడి క్లీన్‌స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement
Advertisement