మ్యాచ్ గెలిస్తే ర్యాంకు పోతుంది! | Sakshi
Sakshi News home page

మ్యాచ్ గెలిస్తే ర్యాంకు పోతుంది!

Published Sat, Jan 7 2017 12:23 PM

మ్యాచ్ గెలిస్తే ర్యాంకు పోతుంది!

బ్రిస్బేన్:ఎవరైనా మ్యాచ్ గెలిస్తే ర్యాంకు మెరుగవుతుంది. మరి ఇక్కడ మ్యాచ్ గెలిస్తే ర్యాంకు పోతుంది. బ్రిస్బేన్ ఓపెన్ లో సానియాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా-బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)లు ఫైనల్ కు చేరారు. ఈ టైటిల్ను సానియా-బెథానీ జోడిలు గెలిచిన పక్షంలో వారి వ్యక్తిగత ర్యాంకుల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

గత 91 వారాలుగా ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా నంబర్ వన్గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రిస్బేన్ టైటిల్ వేటకు అడుగుదూరంలో సానియా-బెథానీలు నిలవడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ టైటిల్ను గెలిచిన పక్షంలో సానియా మీర్జా తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోవల్సి ఉంటుంది. అది కూడా భాగస్వామి బెథానీకే.

గతేడాది హింగిస్‌తో కలిసి సానియా ఈ టోర్నీ టైటిల్‌ నెగ్గగా... బెథానీ ఈ టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం సానియా ఖాతాలో 8,135 పాయింట్లు... బెథానీ ఖాతాలో 7,805 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 330 పాయింట్ల తేడా ఉంది. టైటిల్‌ గెలిస్తే ఈ జంటకు 470 పాయింట్లు... రన్నరప్‌గా నిలిస్తే 305 పాయింట్లు లభిస్తాయి. గతేడాది సానియా ఈ టైటిల్‌ నెగ్గినందుకు ఈసారీ విజేతగా నిలిస్తే ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు చేరే అవకాశం లేదు. బెథానీ గత సంవత్సరం ఈ టోర్నీలో ఆడలేదు కాబట్టి ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు వస్తాయి. దాంతో ర్యాంకింగ్స్‌లో మార్పు వస్తుంది.

ఒకవేళ టైటిల్ ను గెలిచిన పక్షంలో సానియా ర్యాంకును వదులుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా సైకిల్ సిస్టమ్ పద్దతిలో మరి సానియా మ్యాచ్ ఓడి ర్యాంకును కాపాడుకుంటుందా?లేక టైటిల్ గెలిచి ర్యాంకును నిలబెట్టుకుందా? అనేది మాత్రం ఆసక్తికరం. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ ఎకతెరీనా మకరోవా–ఎలీనా వెస్నినా (రష్యా) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది.

Advertisement
Advertisement