పొత్తుకే కట్టుబడ్డాం: సేన, బీజేపీ | Sakshi
Sakshi News home page

పొత్తుకే కట్టుబడ్డాం: సేన, బీజేపీ

Published Tue, Sep 23 2014 4:24 PM

Shiv Sena, BJP call truce, talk seat-sharing

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పొత్తుపై బీజేపీ.. శివసేన చాలారోజుల తర్వాత ఒక్కటయ్యాయి. ఇరు పార్టీల నాయకులు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొత్తును కొనసాగించాలనే తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పాతికేళ్లుగా కొనసాగుతున్న అనుబంధాన్ని కొద్దిపాటి సీట్ల కోసం తెంచుకోవడం సరికాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడం ఇందుకు దారితీసింది. మొత్తం అసెంబ్లీలో ఉన్న 288 సీట్లలో తొలుత 135 సీట్లు కావాలని పట్టుబట్టిన బీజేపీ.. చివరకు 130 అయినా సరేనంటూ శివసేనకు ఆఫర్ ఇచ్చింది. అయితే శివసేన మాత్రం తాము 119కి మించి ఇచ్చే పరిస్థితి లేదని ముందునుంచి చెబుతోంది.

కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారును పడగొట్టడానికి ఇంతకుమించి మంచి సమయం దొరకదని, అందువల్ల పొత్తును కొనసాగించడమే మంచిదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్, మరో్ నాయకుడు సుభాష్ దేశాయ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ఓపీ మాథుర్, రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, విపక్ష నేతలు ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డే తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. మొత్తానికి పొత్తు కొనసాగించాలని ఇరు పార్టీలూ అంగీకరించాయి. ఏదో ఒక సంఖ్య వద్ద ఇద్దరం అంగీకారానికి వస్తామని రౌత్ విలేకరులకు తెలిపారు.

Advertisement
Advertisement