నలుగురు తెలుగువారి జయకేతనం! | Sakshi
Sakshi News home page

నలుగురు తెలుగువారి జయకేతనం!

Published Mon, Oct 20 2014 1:54 AM

నలుగురు తెలుగువారి జయకేతనం! - Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు తెలుగు అభ్యర్థులూ విజయం సాధించారు. వీరిలో ముగ్గురు విదర్భకు చెందిన బీజేపీ అభ్యర్థులే కావడం విశేషం. చంద్రాపూర్ జిల్లా బల్లార్షా నుంచి సుధీర్ మునగంటివార్, యావత్మాల్ జిల్లా యావత్మాల్ నుంచి బీజేపీ అభ్యర్థి మదన్ యేర్వార్, వనీ నుంచి బోద్కువార్ సంజీవరెడ్డి గెలిచారు. సుధీర్ కాంగ్రెస్ అభ్యర్థి ములచందానిపై నాలుగు వేలకుపైగా ఓట్లతో, మదన్ యేర్వార్ శివసేన అభ్యర్థి సంతోష్ డవలేపై స్వల్ప మెజార్టీతో, బోద్కువార్ సంజీవరెడ్డి ఆరు వేల ఓట్ల తేడాతో శివసేన అభ్యర్థి విశ్వాస్ నందేకర్‌పై విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా అల్లుడైన ద్వారం మల్లికార్జున రెడ్డి కూడా నాగపూర్‌లోని రాంటెక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు.

గణపవరం మండలం ముప్పర్తిపాడుకు చెందిన చింతా సూర్యభాస్కరరెడ్డి అల్లుడైన మల్లికార్జున రెడ్డి కాంట్రాక్టరుగా మహారాష్ట్రలో ఉంటూ అంచెలంచెలుగా ఎదగడంతోపాటు, స్వచ్ఛంద సంఘాల సేవల ద్వారా మరాఠా ప్రజల మనసుల్ని గెలిచారు. మహారాష్ట్రలోని మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ఓటమి

చండీగఢ్/ముంబై:  వ్యాపార దిగ్గజం, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ హర్యానాలోని హిస్సార్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దేశంలో అత్యంత సంపన్నురాలిగా ‘ఫోర్బ్స్’ గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్.. మొన్నటిదాకా భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. మహారాష్ట్రలో 353 కోట్ల ఆస్తులను ప్రకటించిన బీజేపీ అశ్యర్థి మోహిత్ కంబోజ్ కూడా ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా కేవలం 15వేల 934 రూపాయల ఆస్తులతో అతి పేదవాడిగా బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థి కిడాపిల్ నారాయణన్ కూడా ఓడిపోయారు. ఇక మహారాష్ట్రలో గణపాత్రో దేశ్‌ముఖ్(88) పదకొండోసారి ఎమ్మెల్యేగా నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈయన సోలాపూర్ జిల్లాలోని సాంగోలా స్థానం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2302 మంది స్వతంత్రులు పోటీ చేయగా 2290మంది ఓటమి పాలయ్యారు. హర్యానాలోని రాయ్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జైతీరథ్ దాహియా ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిపై కేవలం 3 ఓట్ల తేడాతో గెలిచారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement