మళ్లీ లోక్‌పాల్ ఉద్యమం: అన్నా హజారే | Sakshi
Sakshi News home page

మళ్లీ లోక్‌పాల్ ఉద్యమం: అన్నా హజారే

Published Thu, Jan 29 2015 3:38 AM

మళ్లీ లోక్‌పాల్ ఉద్యమం: అన్నా హజారే - Sakshi

నల్లధనం తెస్తానని చెప్పి మోదీ మోసం చేశారు
 రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి  తీసుకురావటంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇది గుణపాఠంగా మారాలని ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావటమే కాకుండా ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు.
 
 ఢిల్లీ ఎన్నికల్లో తలపడుతున్న ఒకప్పటి తన అనుచరులు కేజ్రీవాల్, కిరణ్ బేడీల గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. బేడీ, కేజ్రీవాల్‌లపై తనకు ఎలాంటి కోపం లేదని.. వారి నుంచి ఏదీ ఆశించనప్పుడు కోపమెందుకు వస్తుందనానరు. ఢిల్లీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై తనకు ఆసక్తి లేదన్నారు. పార్టీ రాజకీయాల ద్వారా ఎవరూ ఎలాంటి మార్పూ తీసుకురాలేరన్నారు. తనను ఆ గొడవల్లోకి లాగవద్దని తేల్చి చెప్పారు.  లోక్‌పాల్ అంశంపై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమం చేస్తానని హజారే తెలిపారు. ‘లోక్‌పాల్ చట్టంపై రాష్ట్రపతి సంతకం చేసి 365 రోజలైనా మోదీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తేలేదు’ అని అరోపించారు. ప్రభుత్వం అవినీతిని తీవ్రంగా పరిగణించడం లేదు కనుక లోక్‌పాల్, భూసేకరణ చట్టం తదితర అంశాలపై మళ్లీ ఆందోళన చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement