మంచి–చెడు | Sakshi
Sakshi News home page

మంచి–చెడు

Published Sat, Jun 9 2018 12:11 AM

 Noise was more echoing as it was empty - Sakshi

ఒక రోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియంలోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ హాలు నిండా అద్దాలు ఉండటం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్లు బయటపెట్టి అరిచింది. చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేశాయి. మళ్లీ గట్టిగా అరిచింది. అద్దాలలో కూడా అలాగే కనిపించింది. గది ఖాళీగా ఉండటం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్లేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది.

రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్లు వచ్చి చూసేసరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటినిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరు దీని మీద దాడి చేశారు అని కాపలావాళ్లు ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ కుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది. వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది. ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే. అది మనకు మంచి కాని, చెడు కాని చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే ఈ ప్రపంచం అనుకోవాలి. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు. 
– ఎస్‌.ఎం. బాషా

Advertisement
 

తప్పక చదవండి

Advertisement