ఆడపిల్లని పోలీస్ వ్యాన్‌లోకి...
చూడండి, ఇది చాలా చిన్న విషయం. చాలా పెద్ద విషయం కూడా! కానీ చిన్న పిల్లను పోలీస్ వ్యాన్ ఎక్కించేంత విషయమైతే కాదు.
నూటికి నూరు
మిస్టేక్
చూడండి, ఇది చాలా చిన్న విషయం. చాలా పెద్ద విషయం కూడా! కానీ చిన్న పిల్లను పోలీస్ వ్యాన్ ఎక్కించేంత విషయమైతే కాదు. వ్యవస్థ వ్యాన్‌లో పట్టదు కదా అని, బదులుగా ఆడపిల్లని వ్యాన్‌లోకి తోసేయడం ఏం న్యాయం?! ఎవరైతే శిక్షను అనుభవించాలో వాళ్లే కదా అనుభవించాలి. ఒకరి పరీక్షను ఇంకొకరు రాస్తే చట్టం ఊరుకుంటుందా? అలాగే ఒకరి శిక్షను మరొకరికి వెయ్యడం.. చట్టం ఊరుకోకూడని నేరం. ఊరుకుంటే అది నేరం.
నేరాలకు చట్టంలో శిక్ష ఉంటుంది. చట్టమే నేరం చేస్తే? ఏమౌతుంది? ఏం కాదు. చట్టంలో.. చట్టం పాల్పడే నేరాలకు శిక్షలుండవు! అయినా చట్టం హత్యలు చేస్తుందా, మోసాలు చేస్తుందా? ఏం చేయనవసరం లేదు. కానీ ‘ఏం చేయకుండా’ ఉండడం కొన్నిసార్లు నేరమే అవుతుంది. ‘ఇన్‌సెన్సిబుల్’ అవుతుంది. అవును. చట్టం బుర్ర ఉపయోగించకపోవడం నేరం. రూబీ రాయ్ అనే అమ్మాయి విషయంలో చట్టం ఇలాగే అనాలోచితంగా ‘బోర్డు’ని ఫాలో ఐపోయి, అమ్మాయి ఇంటికి పోలీస్ వ్యాన్‌ని పంపించింది!
క్లాస్ 12లో రూబీ రాయ్ టాపర్. ఈ మధ్యే రిజల్ట్స్ వచ్చాయి. టాపర్ కాబట్టి టీవీ వాళ్లు వెళ్లి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. వాళ్లెందుకు అడిగారో గానీ, ‘‘పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి?’’ అని అడిగారు. ఈమె ఎందుకు చెప్పిందో గానీ ‘‘పొలిటికల్ సైన్స్ అంటే కుకింగ్’’ అని చెప్పింది. ఇది జరిగి నెల. ఈ నెల రోజుల్లో బిహార్‌లో ‘కుకింగ్’ పెద్ద ఇష్యూ ఐపోయింది. పాలిటిక్స్ అంటే కుకింగ్ అని చెప్పిన అమ్మాయికి 500కి 444 మార్కులు రావడం ఏంటని డౌట్స్ మొదలయ్యాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ జరిపింది. రూబీ ర్యాంక్‌ని రద్దు చెయ్యమంది. చేశారు. రూబీకి రీటెస్ట్ పెట్టమంది! పెట్టారు.
రూబీతో పాటు ర్యాంక్ వచ్చిన మరో ముగ్గురికి మొన్న శనివారం బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు రీటెస్ట్ పెట్టింది. ‘‘పరీక్షలు రాసి మూడు నెలలైపోయింది, నాకేం గుర్తులేవు’’ అని చెప్పింది రూబీ. ‘‘పోనీ, తులసీదాస్ మీద చిన్న వ్యాసం రాయి చాలు’’ అని బోర్డు అధికారులు అడిగారు. రూబీ పేపర్ తీసుకుంది. పెన్ను తీసుకుంది. ‘తులసీదాస్ జీ, ప్రణామ్’ అని ఏకవాక్య వ్యాసం రాసి పెన్‌కి క్యాప్ పెట్టేసి, ఇన్విజిలేటర్‌ల వైపు చాలా కాన్ఫిడెంట్‌గా చూసింది. అసలు రీటెస్ట్‌కి వచ్చేటప్పుడే తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. రీటెస్ట్‌కి ఆమెను పోలీసులు వ్యాన్‌లో తీసుకొచ్చారు. ముఖం కనిపించకుండా గుడ్డ కట్టుకోమని చెప్పారు. ఆ అమ్మాయి వినలేదు. నేను కట్టుకోను అంది. రీటెస్ట్‌లో ‘ఫెయిల్’ అయ్యాక పాట్నా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌పై ఆమెను మళ్లీ వ్యాన్‌లోనే తీసుకెళుతున్నప్పుడు ఆమె చేత బలవంతంగా ముఖానికి గుడ్డ కప్పించారు. తనేదో నేరం చేశానని అనుకోలేదు రూబీ. అందుకే ముఖం దాచుకోవాలన్న ఆలోచన ఆమెకు రాలేదు.
అయినా.. ముఖం దాచుకోవలసింది బోర్డు. వ్యానెక్కవలసింది బోర్డు. రీటెస్ట్ రాయవలసింది బోర్డు. పరీక్షల నిర్వహణలోని లోపాలకు రూబీలాంటి విద్యార్థులను ఫెయిల్ చేయడం అంటే.. బోర్డు తనకు తాను వందకు వంద మార్కులు వేసుకోవడమే. చూసి రాయడం పిల్లలు చేసే పని. సెంట్ పర్సెంట్ మార్కులు వేసుకోవడం పెద్దలు చేయకూడని పని.
మాధవ్ శింగరాజు


