దేవుడా! ఈ దేశాన్ని బాగుచెయ్యి!! | Sakshi
Sakshi News home page

దేవుడా! ఈ దేశాన్ని బాగుచెయ్యి!!

Published Tue, Jul 29 2014 11:44 PM

A.G. Krishna Murthy interview

అంతర్వీక్షణం!

అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి... అంటే వెంటనే గుర్తొస్తారో లేదా కానీ, ‘ముద్రా’ కృష్ణమూర్తి అని కానీ, ఎ.జి కృష్ణమూర్తి అని కానీ చెబితే వెంటనే గుర్తొస్తారాయన. ‘ద స్కూల్ ఆఫ్ ఐడియాస్’ అనే ట్యాగ్‌లైన్‌తో మైకా (ఎమ్‌ఐసిఎ) సంస్థను స్థాపించి కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్‌లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతోపాటు ఆయన అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం.
 
 మీ గురించి మీరు ఒక్కమాటలో...
 ‘కష్టే ఫలి’ అని నమ్మే వ్యక్తిని
     
 మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం?
 నచ్చే లక్షణం. గమ్యాన్ని సాధించాలనే తపన ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరగను. నచ్చని లక్షణం - షార్ట్ టెంపర్‌మెంట్. అందరూ నాలాగా ఉండాలని కోరుకుంటాను. అలా జరగనప్పుడు కోపం వస్తుంది.
     
 ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది?
 నిజాయితీ కోసం చూస్తాను. మెప్పు కోసం చెబుతున్నారా, నిజాయితీతో మాట్లాడుతున్నారా అని చూస్తాను.
     
 ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు?
 నిరాడంబరంగా ఉండేవారిని, పాలిటిక్స్ ప్లే చేయని వాళ్లను, సున్నితంగా నిర్మొహమాటంగా మాట్లాడేవారిని.
     
 ఎక్కడ స్థిరపడాలనుకున్నారు?ఎక్కడ స్థిరపడ్డారు? (ప్రదేశం, రంగం)
 అహ్మదాబాద్‌లో స్థిరపడాలనుకున్నాను. మా అబ్బాయి కోరిక ప్రకారం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేను 18 ఏళ్లకే కథలు రాశాను. సృజనాత్మకత నా శక్తి, బలం అని తెలిసి యాడ్ ఫీల్డ్‌లోకి వెళ్లాను.
     
 మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు?
 నా భార్య లీల.
     
 మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి?
 ధీరూభాయ్ అంబానీ
     
 మీ కెరీర్‌లో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన...
 విమల్ సూటింగ్స్ ప్రకటన విషయంలో ఫ్రాంక్సిమాయిస్ (ఆ ప్రకటన తయారు చేసింది ఆయన కంపెనీనే)అనే రచయిత ధీరూబాయ్ అంబానీతో ‘ఈ ప్రకటనలో బాడీ ఉంది కానీ, సోల్ లేద’న్నారు. నమ్మిన నిజాన్ని కచ్చితంగా చెప్పగలగడం చాలా అవసరం అని అప్పుడు తెలుసుకున్నాను.  
     
 తొలి సంపాదన?
147 రూపాయల 50 పైసలు. గుంటూరులో భారతీయ పురాతత్వ శాఖలో ఉద్యోగానికి అందుకున్న జీతం.
     
 పెద్ద మొత్తం అందుకున్న సందర్భం...
ముద్ర కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా
     
మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన వ్యక్తి, బాధ పెట్టిన సంఘటన..?
ఉన్నాడు ఒక సెక్రటరీ, తెలుగువాడే. గుజరాత్‌లో 15 ఏళ్లకు పైగా నా దగ్గర పనిచేశాడు. హఠాత్తుగా మా పిల్లలు, భార్య, అత్తగారి అకౌంట్స్ నుంచి ఫోర్జరీ సంతకాలతో డబ్బు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఇంట్లో ఒకడిగా కలిసి పోయిన వ్యక్తి ఇలా చేసినందుకు బాధ కలిగింది.
     
 నేర్చుకున్న పాఠం
 అప్పటినుంచి చెక్కుబుక్కు నా దగ్గరే పెట్టుకుంటున్నాను.
     
 భాగస్వామికి తగిన సమయం కేటాయిస్తున్నానని అనుకుంటున్నారా ?
 అస్సలు లేదు. అదే పెద్ద న్యూనతాభావం ఇప్పటికీ ఉంది.
     
 మిమ్మల్ని మీరు సవరించుకున్న అంశం ఏదైనా ఉందా?
 నాకు చాలా కోపం ఉండేది. ఒక ఫ్రెండ్ ఒకసారి ‘నువ్వు కోపంలో ఏం మాట్లాడతావో నీకు తెలియడం లేదు. కోపం తగ్గించుకో’ అని చెప్పాడు. క్రమంగా యాంగర్ మేనేజ్‌మెంట్ నేర్చుకున్నాను.
 
 మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి ?
పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువ ఆందోళన చెందేవాడిని.
     
ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? ఆరోజును ఎలా గడుపుతారు?
భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు నా కుటుంబం మొత్తంతో సంతోషంగా గడపాలి. నా తర్వాత పిల్లల మధ్య పేచీలు రాకుండా రాతకోతల వంటి సర్దుబాట్లు చేసేయాలి.
 
దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు
దారిద్య్రం, లంచగొండి తనం నుంచి ఈ దేశాన్ని బాగు చేయమని.
 
 - వాకా మంజులారెడ్డి
 

Advertisement
Advertisement