అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

Published Fri, Oct 9 2015 1:43 AM

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

- భువనగిరి మండలంలో  హెచ్‌ఎండీఏ ఆకస్మిక దాడులు
- 18 లేఅవుట్లను సమూలంగా కూల్చివేసిన అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లపై హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఉక్కుపాదం మోపింది. నల్గొండ జిల్లా భువనగిరి మండలంలోని కూనూర్, రాయగిరి గ్రామాల్లో అక్రమంగా అభివృద్ధి చేసిన 18 లేఅవుట్లపై హెచ్‌ఎండీఏ అధికారులు దాడులు నిర్వహించి  తొలగించారు. హెచ్‌ఎండీఏ సెక్రటరీ బాలాజీ రంజిత్‌ప్రసాద్ పర్యవేక్షణలో సుమారు 40 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించి రాయగిరిలో 2, కూనూర్‌లో 16 అక్రమ లేఅవుట్లను కూల్చివేశారు.
 
 రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్‌ను వినియోగించి ఆయా లే అవుట్లలోని ఆర్చిలు, సైట్ డిజైన్ బోర్డులు, రోడ్లు, విద్యుత్ పోల్స్, డ్రెయినేజీ పైపులైన్లను తొలగించారు. ఉన్నపళంగా హెచ్‌ఎండీఏ అధికారులు అక్రమ లే అవుట్లపై విరుచుకుపడటంతో స్థానికంగా కొంత కలకలం చెలరేగింది. హెచ్‌ఎండీఏ అప్రూవల్ ఉన్నట్లు ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను మోసగిస్తున్న అక్రమార్కుల ఆటలు ఇక సాగనివ్వమంటూ ఈ సందర్భంగా సెక్రటరీ బాలాజీ రంజిత్ ప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు. భువనగిరి మండలంలో అక్రమ లేఅవుట్లు 150-200 వరకు ఉన్నట్లు తమ పరిశీలనలో తే లిందని, వాటన్నింటినీ దశల వారీగా కూల్చివేస్తామని తెలిపారు.
 
 హెచ్‌ఎండీఏ పరిధిలో అయితే...  హెచ్‌ఎండీఏ నుంచి, ఆ పరిధి దాటితే... డీటీసీపీ నుంచి  కొత్త లేఅవుట్లకు అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా అక్రమంగా వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కుదరదన్నారు.యాదగిరి గుట్ట అథార్టీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో కొందరు అక్రమార్కులు దాన్ని చూపిస్తూ హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా లే అవుట్లు వేశారని, వాటిలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. ఈ వ్యవహారంలో హెచ్‌ఎండీఏకు చెందిన అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటామన్నారు.
 
 కూల్చివేసిన లేఅవుట్స్
 వరభూమి డెవలపర్స్, అగ్రిగోల్డ్ ఎస్టేట్ ప్రై.లి., ఇమ్రాన్‌నగర్, శ్రీవైష్ణవీ ప్రాజెక్ట్సు, మెసర్స్ ఆశ్రయ డెవలపర్స్, ఇంపీరియ్ టౌన్, బృందావన్ టౌన్‌షిప్, సుఖీభవ అండ్ వనమాలి టౌన్‌షిప్ ప్రై.లి., సంధిపట్ల ఆర్క్, ఎస్‌ఎన్‌ఎం డెవల పర్స్, అరుణా డెవలపర్స్, టెంపుల్ అవెన్యూ అండ్ సాయి స్నేహిత రియల్టర్స్ ప్రై.లి., శ్రీవైష్ణవి హోమ్స్ రాయల్ సిటీ, శ్రీ లక్ష్మీనరసింహా గోల్డెన్ ఎన్‌క్లేవ్, శ్రీ కార్తికేయ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రా లి., జీపీఆర్ రియల్టర్స్, అక్షితా టౌన్‌షిప్

Advertisement
Advertisement