వ్యథలో ఊరటగా.. ఆపదలో బాసటగా... | Sakshi
Sakshi News home page

వ్యథలో ఊరటగా.. ఆపదలో బాసటగా...

Published Sat, May 28 2016 12:23 AM

వ్యథలో ఊరటగా.. ఆపదలో బాసటగా... - Sakshi

మట్టిపెళ్లలు విరిగిపడి మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించిన వైఎస్సార్ సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పూర్తి స్థాయిలో న్యాయం జరిగే  వరకు అండగా ఉంటానని భరోసా
అవసరమైతే కలెక్టరేట్ ఎదుట  ధర్నా నిర్వహిస్తామని వెల్లడి
గన్నవరం నుంచి పెదగొట్టిపాడు వరకు ఘన స్వాగతం పలికిన  పార్టీ శ్రేణులు

 

ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా.... ఏ ఆపద వచ్చినా.. ఆత్మీయుడిలా, ఆత్మబంధువులా ‘నేనున్నా’నంటూ వచ్చి, బాధితులకు భరోసానిచ్చి, ఆ కుటుంబీకుల్లో మనోధైర్యం నింపే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. గుంటూరు లక్ష్మీపురంలో ఈ నెల 14న మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన వారి కుటుంబాలను పెదగొట్టిపాడులో పరామర్శించి ఓదార్చారు. తానున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. మీ వెంటే ఉండి పోరాడతానని భరోసానిచ్చారు. పది రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని, తాను కూడా పాల్గొంటానని మాటిచ్చారు.                                          

                             

 

గుంటూరు :   గుంటూరు లక్ష్మీపురంలోని భవన నిర్మాణ పనుల్లో ఇటీవల ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతి చెందారు.  మృతుల కుటుంబాలను ఓదార్చి వారిలో మనోధైర్యం నింపేందుకు శుక్రవారం జిల్లాకు వచ్చిన  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు వరకు జననేత కోసం జనసంద్రంలా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 
గన్నవరంలో ఘనస్వాగతం

ఉదయం 9.15 గంటలకు విమానంలో గన్నవరం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ అందరితో మాట్లాడుతూ అక్కడి నుంచి జగన్ బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో పశువైద్య కళాశాల విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.  వైద్య విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టి తమ పక్షాన పోరాడి న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో జగన్‌వారికి  భరోసానిచ్చి అక్కడి నుంచి గుంటూరు పయనమయ్యారు.  తాడేపల్లి వద్ద నిర్వాసితులు జగన్‌ను కలిసి తమ గోడు విన్నవించారు.

 
ముస్లిం సంప్రదాయ రీతిలో సత్కారం...

ప్రత్తిపాడు పెట్రోలు బంకు సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు ప్రత్తిపాడు మండల నాయకులు, గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వాగతం పలికారు.  అక్కడ దివంగత జగ్జీవన్‌రామ్, బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాతమల్లాయపాలెం సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి ముందుకు సాగారు. అంకమ్మతల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి పెదగొట్టిపాడుకు పయనమయ్యారు. మధ్యంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నేతలు షేక్ జిలానీ, గులాం రసూల్ పలువురు పెద్ద సంఖ్యలో మైనార్టీలతో తరలి వచ్చి జగన్‌ను ముస్లిం సంప్రదాయ రీతిలో సత్కరించారు. అక్కడి నుంచి పెదగొట్టిపాడు చేరుకున్న జగన్ గ్రామ సర్పంచ్ గుంటుపల్లి బాబురావు నివాసంలో అల్పాహారం స్వీకరించారు.

 
ముఖ్యనేతల హాజరు

పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ,  కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్థసారథి, మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి,  పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, కృష్ణా జిల్లా సమన్వయకర్తలు మొండితోక జగన్‌మోహన్‌రావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, జోగి రమేష్, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌బాబు, గుంటూరు జిల్లా సమన్వయకర్తలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహరనాయుడు, పార్టీ నేతలు రాతంశెట్టి రామాంజనేయులు, కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు,  నసీర్ అహ్మద్, గులాం రసూల్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, శానంపూడి రఘురామిరెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, మేరా జ్యోత్ హనుమంతునాయక్,  బండారు సాయిబాబు, కొలకలూరి కోటేశ్వరరావు, కొత్తా చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఇళ్లు కోల్పోతున్నాం....
రోడ్డు విస్తరణ, పుష్కర ఘాట్‌ల నిర్మాణ పనుల వల్ల తాము ఇళ్లు కోల్పోతున్నామని,  న్యాయం చేయాలని,  తమ పక్షాన అండగా నిలిచి పోరాటం చేయాల్సిందిగా కనకదుర్గ వారధి వద్ద నిర్వాసితులు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో స్థానిక నాయకుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, నిర్వాసితులు పెద్ద సంఖ్యలో జగన్‌కు వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఉపేక్షించబోమని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి గుంటూరు నగరం మీదుగా  పెదగొట్టిపాడుకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఏటుకూరు సెంటర్‌లో గుంటూరు రూరల్ మండల నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పుల్లడిగుంటలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఐదో మైలు సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

 

మృతుల కుటుంబాలకు ఓదార్పు ...
లక్ష్మీపురంలో మట్టి పెళ్లలు విరిగి పడడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో జగన్ పెదగొట్టిపాడులోని  ఏడుగురు ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో అక్కడ ఉద్వేగ వాతావరణం నెలకొంది. వరుసగా జొన్నలగడ్డ ప్రశాంత్,  బత్తుల సునిల్, బూసి సలోమాన్, బత్తుల రాజేష్, తురకా శేషుబాబు, తురకా రాకేష్‌కుమార్, జొన్నలగడ్డ సుధాకర్ ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు. పది రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని, ధర్నాలో తాను కూడా పాల్గొంటానని,  అందరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి గన్నవరం వెళ్లారు.

Advertisement
Advertisement