రోస్టర్ విధానమే.. | Sakshi
Sakshi News home page

రోస్టర్ విధానమే..

Published Sat, Apr 19 2014 1:04 AM

History roster ..

ఆలిండియా సర్వీస్ కన్ఫర్డ్ అధికారుల పంపిణీపై సిన్హా కమిటీ నిర్ణయం
 
మే 28 కల్లా ఏ ప్రాంతానికి ఎవరో స్పష్టీకరణ

 
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర క్యాడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు కన్ఫర్డ్  అధికారుల పంపిణీకి రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యూష సిన్హా కమిటీ స్పష్టం చేసింది. రోస్టర్ విధానం వల్ల ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కన్ఫర్డ్  ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వినతులను కమిటీ ఖాతరు చేయలేదు. అధికారుల పంపిణీపై అభిప్రాయాలు వెల్లడించేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సంఘాల ప్రతినిధులను ఈ నెల 15న ఆహ్వానించిన ప్రత్యూష సిన్హా కమిటీ వారిని చిన్నచూపు చూసింది.

ఈ నేపథ్యంలో సంఘాల ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సహాయ కార్యదర్శిని కలసి వినతి పత్రాలను సమర్పించారు. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను సంబంధిత ప్రాంతానికే కేటాయించాలన్న వినతిపై సహాయ కార్యదర్శి స్పందన సంతృప్తికరంగా లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చాలా క్లిష్టతరమైన ఈ అంశంపై నిర్ణయాన్ని తమకే వదిలేయాలని సహాయ కార్యదర్శి స్పష్టం చేశారు. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి గతంలో ఏర్పడిన రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్నే పాటించాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయానికి వచ్చింది. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే పంపిణీ చేయనున్నారు. కన్ఫర్డ్ అధికారులను మాత్రం ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి పంపిణీ చేయకుండా రోస్టర్ విధానం ద్వారా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ విధానాన్ని తెలంగాణకు చెందిన కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర కమిటీకి తెలియజేసినా స్పందన రాలేదు. 

ఇక డెరైక్ట్ రిక్రూటీల్లో రాష్ట్రేతరుల పంపిణీని కూడా రోస్టర్ విధానంలోనే చేయనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియను మే నెలాఖరులోగానే పూర్తి చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈమేరకు మే 28వ తేదీ కల్లా అధికారుల కేటాయింపులను కమిటీ పూర్తి చేయనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement