ఫొటోలు తీసింది... ఇప్పుడు మొక్కలు నాటుతోంది

Published on Wed, 08/16/2017 - 00:49

డ్రోన్లు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది.. హై ప్రొఫైల్‌ పెళ్లిళ్లలో ఫొటోలు తీసేవి మాత్రమే. కానీ ప్రపంచం చాలా అడ్వాన్స్‌ అయిపోతోంది. కొన్ని చోట్ల డ్రోన్లు గుండెపోటు వచ్చిన వారికి అత్యవసర వైద్యసేవలందించేందుకు ఉపయోగపడుతూంటే... ఇంకోచోట సుదూర ప్రాంతాల్లో ఉండేవారికి రక్తం సరఫరా చేసేందుకు పనికొస్తున్నాయి. అమెజాన్‌ లాంటి కంపెనీలు డెలివరీ బాయ్‌ల స్థానంలో ఏకంగా డ్రోన్‌ సైన్యాన్ని పెట్టే ఆలోచనల్లో ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒకట్రెండు ఏళ్ల క్రితం ఇలాగే డ్రోన్లతో ఈ భూమిని పచ్చగా మార్చేస్తానని ఓ ఐరిష్‌ కంపెనీ బయలుదేరింది. పేరు బయోకార్బన్‌.

డ్రోన్ల సాయంతో అడవులను పెంచాలన్నది ఈ కంపెనీ ప్లాన్‌. ఈ ఐడియా విన్న వారందరూ అప్పట్లో ఆ.. అసలు ఇది అయ్యే పనేనా అని పెదవి విరిచేశారు గానీ బయోకార్బన్‌ ఇప్పుడు మన పొరుగున ఉన్న మయన్మార్‌లో రంగంలోకి దిగనుంది. ఇర్రవాడీ నదీ పరీవాహక ప్రాంతంలోని మడ అడవుల్లో దాదాపు 27 లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. మనుషులకైతే ఇన్ని మొక్కలు నాటేందుకు ఏళ్లు పట్టేవేమోగానీ.. రోజుకు లక్ష మొక్కల్ని నాటేయగల డ్రోన్లకు ఇది చిటికెలో పని.

అయితే ఇందుకోసం బయోకార్బన్‌ సంస్థ చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అడవులను పెంచాలనుకున్న ప్రాంతాన్ని ముందుగా క్షుణ్ణంగా డ్రోన్లతోనే సర్వే చేయడంతో ఈ ప్రాజెక్టు మొదలవుతుంది. ఎత్తు పల్లాలు, రాళ్లూ రప్పలు ఎక్కడున్నాయి? నీటి ప్రవాహం ఎక్కడుంది? మొక్కలు ఎక్కడ నాటితే ఎక్కువకాలం మనగలిగే అవకాశముంది? వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇంకో డ్రోన్‌ ముందుగా నిర్దేశించుకున్న ప్లాన్‌ ప్రకారం.. విత్తన బాంబులను (మొక్కల విత్తనాలు, పోషకాలు కలిపిన బంతుల్లాంటి నిర్మాణాలు) జారవిడుస్తుంది.

మొత్తం 250 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు పది లక్షల మొక్కలను నాటడం వచ్చే నెలలో మొదలు కానుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ప్రాజెక్టు మరింత ముందుకు సాగి.. ఏకంగా వందకోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్లు సిద్ధమవుతున్నాయి! అన్నట్టు.. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ కూడా డ్రోన్లతో పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తోంది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ