More

దేవుడు మరణించాడు.. మనిషిలో..!

18 May, 2015 02:20 IST
దేవుడు మరణించాడు.. మనిషిలో..!

ఇరవై నిమిషాల వ్యవధిలో ముగిసిపోయే షార్ట్ ఫిల్మ్ నుంచి ఏమేం ఆశించవచ్చు? ఆధునిక అనుబంధాలను అర్ధం అయ్యి కానట్టు నిర్వచించే కాసిన్ని ప్రేమ సన్నివేశాలు, యవతకు ‘కిక్కెక్కించే’ ఇంకొన్ని సంభాషణలు.. అంతేకదా..! కాదు, అంతకు మించి కూడా అని నిరూపించాడు నగరానికి చెందిన షార్ట్ ఫిలిమ్స్ రూపకర్త జయశంకర్. ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ పేరుతో ఈయన రూపొందించిన పొట్టి చిత్రం గట్టి ఆదరణ పొందుతోంది. అందుకు కారణం.. యువతకు సమకాలీన జీవితాన్ని చూపడం కాదు.. జీవితానికి మరో కోణం చూపడం. అప్‌లోడ్ చేసిన ఆరు రోజుల్లోనే యూ ట్యూబ్‌లో దాదాపు లక్షా పాతికవేల వ్యూస్ దక్కించుకున్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఏముంది?                  
 
‘లైఫ్ అంటే ఏముంది బ్రదర్? నోటినిండా అబద్ధాలు, జేబులో క్రెడిట్ కార్డులు. చిన్న చిన్న మోసాలు.. చిరకాలం కులాసాలు’.. హ్యాపీ గో లక్కీ టైప్‌లో బతికేసే ప్రస్తుత కుర్రకారు జీవన్నినాదం ఇది. కథలోకి వెళితే ఆవలించినంత తేలికగా అబద్ధాలు చెప్పేసే నవతరం కుర్రాడికి ప్రతినిధి లాంటి గోవింద్ ఇంటర్వ్యూకి వెళతాడు. అక్కడ అతనికి ఓ విచిత్రమైన వ్యక్తి ఎదురవుతాడు. ఇంకు లేని పెన్నుతో పేజీల కొద్దీ రాసేస్తూ గోవింద్‌కి ప్రశ్నలు సంధిస్తూ, అతను చెప్పే మాటల్లోని నిజానిజాలను ఇట్టే పసిగట్టేస్తుంటాడు. ‘బాబోయ్ ఈ ఇంటర్వ్యూకో దణ్నం’ అంటూ గోవింద్ పారిపోయే ప్రయత్నం చేసినా అవకాశం కూడా అతనికి దొరకదు. చివరికి అది నిజమైన ఇంటర్వ్యూ కాదని, తాను జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయి అక్కడికి వచ్చానని గోవింద్‌కి తెలుస్తుంది. తనను ఇంటర్వ్యూ పేరుతో ముప్పు తిప్పలు పెట్టిన ఆ వ్యక్తి దేవుడి తరఫున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పని చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు.

అక్కడి నుంచి సదరు భగవంతుడి సీఈఓకి, గోవింద్‌కి మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలే ఈ సినిమాకు ఆయువుపట్టు. ముఖ్యంగా సీఈఓ నోట పలికించిన కొన్ని మాటలు ‘షార్ట్’ సినిమా స్థాయిని అమాంతం బిగ్ స్క్రీన్‌కు సాటిగా మార్చేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దేవుడు మనకు అడిగినవన్నీ ఇస్తే ఆయన మీద నీకు నమ్మక ం పెరుగుతుంది. ఇవ్వకపోతే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది’, ‘దేవుడు ఎంతో ఇష్టంగా ఈ భూమిని సృష్టించాడు. దీన్ని మనుషులే నరకంగా తయారు చేసి మాకు ఇంకో నరకాన్ని తయారు చేసే అవసరాన్ని తప్పించారు. ఇప్పుడు మిగిలిన గ్రహాల్లో తప్పులు చేసినవారికి పనిష్మెంట్‌గా భూమికి పంపుతున్నాం’.. వంటివి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. దేవుడు చనిపోయాడంటూ చెప్పి మనల్ని షాక్ తినిపిస్తూనే ప్రతి మనిషిలో ఉండాల్సిన దేవుడు చనిపోయాడంటూ ఇచ్చే ముక్తాయింపు ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతంతో పాటు గోవింద్ పాత్రధారి శశాంక్, సీఈఓగా నటించిన వినోద్ వర్మ.. చక్కగా నటించి మంచి భవిష్యత్తు ఉన్న నటులనిపించారు.
 
మొబైల్‌తో తీశా..

షార్ట్ ఫిల్మ్ అంటే కేవలం ప్రేమకో, సరదాకో కాకుండా విలువలు నేర్పేది ఎందుకు కాకూడదు? మనల్ని మనం సమీక్షించుకునేలా ఎందుకు ఉండకూడదు? లాంటి ఆలోచన నే ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ తీసేందుకు దోహదం చేసింది. ఈ సినిమాని వన్ ప్లస్ వన్ మొబైల్ ఫోన్‌తో తీయడం మరో విశేషం’ అని చెప్పారు దర్శక, రచయిత జయశంకర్.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్‌బో బేబీ!

గాన సరస్వతి

Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు

Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం

ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్‌ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..