More

కాలుష్యం ఎవరి పాపం?

7 Dec, 2017 01:34 IST

ఉష్ణోగ్రతలు తగ్గి, శీతగాలులు మొదలయ్యేసరికి మన నగరాల్లోని కాలుష్య భూతం మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. దట్టంగా వ్యాపించే పొగమంచులో దుమ్మూ, ధూళి కణాలతోపాటు కార్బన్‌ డై ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వంటి మృత్యు ఉద్గారాలు కలగలిసి జనం ఊపిరితిత్తుల్లోకి చొరబడతాయి. కొంచెం కొంచెంగా ప్రాణాలను పీల్చేస్తుంటాయి. సాధారణ సమయాల్లో కాలుష్యం గురించి పట్టనట్టుండే ప్రభుత్వాలు ముప్పు ముంచుకొచ్చాక ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు కనబడతాయి. విద్యా సంస్థలకు నాలుగైదు రోజులు సెలవులు ప్రకటించడం, సరి బేసి సంఖ్యల ఆధారంగా వాహనాలను అనుమతించడం, నిత్యావసర సరుకులు తీసుకొచ్చే వాహనాలకు తప్ప ఇతర భారీ వాహనాలకు నగరంలో అనుమతి నిరాకరించడం వంటి నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఇలాంటి చర్యలేవీ మూలాలను తాకవు. కనుక సమస్య యధాతథంగా ఉండి పోతుంది. కాలం గడుస్తున్నకొద్దీ అది పెరుగుతూ పోతుందే తప్ప తగ్గదు. ఈసారి శీతాకాలం పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్టు కనబడుతోంది. హైదరాబాద్‌ మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఇదే కథ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను ప్రభావం పర్యవసానంగా శీతగాలుల్లో తేమ ఆవరించి దానికి పరిశ్రమలనుంచి, వాహనాలనుంచి వెలువడే కాలుష్యం తోడై జంటనగరాల్లో ప్రమాద తీవ్రత హెచ్చింది. మరో వారం వరకూ ఈ పరిస్థితి మారకపోవచ్చునని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. ఒక్క శీతాకాలం మాత్రమే కాదు... ఏటికేడాదీ కాలుష్యంతో నిండి ఉండే న్యూఢిల్లీ గురించి చెప్పనవసరమే లేదు. అక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక క్రీడాకారులు మాస్క్‌లు ధరించి పాల్గొన్నారు. ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లయితే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులెదురై మైదానం నుంచి నిష్క్రమించారు. లంక జట్టు కావాలనే ఇలా చేసిందని, ఇదంతా నటనేనని సెహ్వాగ్‌ లాంటివారు విమర్శించి ఉండొచ్చుగానీ... కాలుష్యం తీవ్రతను తక్కువ అంచనా వేయలేం.  

వేకువజామునే పనుల కోసం రోడ్డెక్కేవారూ, బస్సుల కోసం ఎదురుచూసే బడి పిల్లలు, ఉద్యోగ బాధ్యతల కోసం కార్యాలయాలకు వెళ్లాల్సినవారూ ఈ పొగమంచులో చిక్కుకుంటున్నారు. ఎదురుగా ఏముందో కనబడక ఢిల్లీలో ఇటీవల పదులకొద్దీ వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్న వైనం సామాజిక మాధ్యమాల్లో అందరూ చూశారు. నిజానికి నిరుడు నవంబర్‌లో తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆ మండలి స్పందిస్తున్న తీరు సరిగా లేదని దుయ్యబట్టింది. అటు ఢిల్లీ ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు కూడా తీవ్రంగా అభిశంసించింది. ప్రభుత్వ యంత్రాంగాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి సారాంశంలో నరమేథానికి పాల్పడటంతో సమానమని వ్యాఖ్యానించింది. ఇంతగా మందలించినా ఈ ఏడాది మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. దేశ రాజధాని నగరం ‘గ్యాస్‌ ఛాంబర్‌’గా మారిపోయింది. భారత్‌లో 1990–2015 మధ్య వాయు కాలుష్యంవల్ల సంభవించిన మరణాలు 47 శాతం పెరిగాయని ఈ ఏడాది మొదట్లో వెలువడిన అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. కాలుష్యం పెరగడం వల్ల నెలలు నిండకుండానే పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతున్నదని ఆ నివేదిక హెచ్చరించింది. సమస్య తెలుసు... సమస్యకు గల మూల కారణం తెలుసు. శీతాకాలంలో అది మరింత పెరుగుతుందని తెలుసు. కానీ దీన్ని ఎదుర్కొనడంలో ప్రతిసారీ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు సైతం వాటి చెవులకు సోకడం లేదు.

ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడి చేస్తున్న నిర్ణయాలే సమస్యను ఉన్నకొద్దీ పెంచుతున్నాయి. అభివృద్ధి పేరిట సమస్తమూ నగరాల్లో కేంద్రీ కరించడంలోనే ఈ సంక్షోభం మూలాలున్నాయి. ఒకేచోట పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు కేంద్రీకరించడం వల్లా... సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు, అనేకానేక ప్రభుత్వ కార్యాలయాలూ ఉండటం వల్ల వాటిల్లో పనిచేసేవారంతా తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాల్సివస్తోంది. అటు పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు తగ్గి వారంతా నగరాలకు వలస రావలసివస్తోంది. ఇలాంటివారందరికీ అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాని బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై వేచి చూడటం కంటే అప్పో సప్పో చేసి సొంతంగా వాహనం సమకూర్చుకుంటే సమస్య తీరిపోతుందన్న ధోరణి పౌరుల్లో పెరుగుతోంది. పరిశ్రమలు వదిలే కాలుష్యం చాలదన్నట్టు అదనంగా ఈ వాహనాలు వదిలే ఉద్గారాలు వాతావరణంలో కేన్సర్‌ కారక కార్సినోజిన్‌ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. దేశంలో ఏ నగరం చరిత్ర చూసినా ఇదే పరిస్థితి. నిరుడు వివిధ నగరాల వాయు నాణ్యత గురించి పరీక్షలు నిర్వహిస్తే పట్నా, లూధియానా, బెంగళూరు, లక్నో, అలహాబాద్‌ నగరాల్లోని పౌరులు అక్షరాలా మృత్యువును ఆఘ్రాణిస్తున్నారని వెల్లడైంది. నిజానికి ప్రభుత్వాలు తల్చుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోదు. ఆధార్‌ కార్డు లేకపోతే జీవించడమే సాధ్యం కాదన్నంత స్థాయిలో ప్రచారం చేస్తూ... న్యాయస్థానాలు విధిస్తున్న పరిమితులను కూడా లెక్క చేయక వాటిని బలవంతంగా జనంపై రుద్దుతున్న పాలకులకు కాలుష్యాన్ని తర మడం ఒక సమస్యా? వాహనాల అమ్మకాలను నియంత్రించడం, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచడం, నిబంధనలకు అనుగుణంగా  పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయో లేదో పటిష్టమైన నిఘా పెట్టడం వగైరా చర్యలకు ఉపక్రమిస్తే కాలుష్యం దానంతటదే సర్దుకుంటుంది. కావలసి నందల్లా దృఢ సంకల్పం... చిత్తశుద్ధి. ఆ రెండూ పాలకులకు కలగనంతకాలమూ కాలుష్యమూ, అందువల్ల కలిగే అనర్థమూ ఈ మాదిరే కొనసాగుతాయి. రాను రాను అవి విస్తరిస్తూ పోతాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మార్పుల వ్యూహంతో మేలెంత?!

ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!

పల్లవి... కాంగ్రెస్, చరణం... చంద్రబాబు!

Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్

Deep Fake: ఇది లోతైన సమస్య!