ముంబైకి గుడ్‌బై.. ఆ జట్టులో చేరనున్న రోహిత్‌ శర్మ?! | Sakshi
Sakshi News home page

ముంబైకి గుడ్‌బై.. ఎవరూ ఊహించని జట్టులో చేరనున్న రోహిత్‌ శర్మ?!

Published Wed, Apr 10 2024 2:11 PM

Is Rohit Sharma To Leave MI LSG Dreaming Of Signing Him In IPL 2025 Auction - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్‌-2025 ఆరంభానికి ముందై ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా?.. అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాడా?.. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభమైన నాటి నుంచే హిట్‌మ్యాన్‌ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది.

కాగా ఐపీఎల్‌-2024కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను భారీ ధరకు ట్రేడ్‌ చేసుకున్న ముంబై ఇండియన్స్‌.. రోహిత్‌ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది.

ఇందుకు బదులుగా రోహిత్‌ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయంపై తమకున్న కోపాన్ని పాండ్యాపై నేరుగానే ప్రదర్శిస్తున్నారు అభిమానులు. మైదానంలో అతడిని హేళన చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోహిత్‌ వద్దని వారించినా వారు వినే స్థితిలో లేరు.

ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ పట్ల కూడా హార్దిక్‌ ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. పదే పదే అతడి ఫీల్డింగ్‌ పొజిషన్‌ మార్చడంతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సేవలను కూడా సరిగ్గా వాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇక ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి.. నాలుగో మ్యాచ్‌లో గెలిచినా రోహిత్‌ ముఖంలో పెద్దగా సంతోషం కనిపించకపోవడం జట్టులోని విభేదాలను తేటతెల్లం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

ఎవరూ ఊహించని జట్టులోకి రోహిత్‌?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు రోహిత్‌ శర్మను సొంతం చేసుకోనుందని అందులోని సారాంశం. ఈ వార్త పుట్టుకు రావడానికి ఓ కారణం ఉంది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్నో కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్‌లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్‌ అడగ్గా.. ‘‘ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా?

ఎవరి పేరైనా చెప్పవచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు’’ అని లాంగర్‌ తిరిగి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ‘‘మేము చాలా మంది పేర్లు అనుకుంటున్నాం గానీ రోహిత్‌ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా?’’ అని పేర్కొన్నారు.

దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్‌.. ‘‘ఏంటీ రోహిత్‌ శర్మనా? ఒకే అతడిని ముంబై నుంచి మేము ట్రేడ్‌ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ డీల్‌ మీరే కుదర్చగలరు’’ అని సరదాగా సమాధానమిచ్చాడు. ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరిన రోహిత్‌ శర్మ 13 సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్‌ గెలిచాడు. 

చదవండి: రోహిత్‌, కోహ్లి కాదు.. భూగ్రహం మొత్తం మీద అతడే బెస్ట్‌!

Advertisement
 
Advertisement