వ్యతిరేకతను అధిగమించి హ్యాట్రిక్‌ కొడతారా? | Sakshi
Sakshi News home page

వ్యతిరేకతను అధిగమించి హ్యాట్రిక్‌ కొడతారా?

Published Sat, Oct 28 2023 5:25 PM

Hatrick In Third Constituency Assembly Elections - Sakshi

ఆ ఎమ్మెల్యే మీద ఊళ్ళకు ఊళ్ళే తిరగబడుతున్నాయట. మా ఊళ్ళోకి రావద్దని ప్రజలు అడ్డగిస్తున్నారట. పొలిమేరలోనే అడుగుపెట్టనీయడంలేదట. అభివృద్ధి చేయని ఎమ్మెల్యేకు ఈసారి ఓటడిగే హక్కులేదని తేల్చి చెబుతున్నారట. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది? మరి ప్రత్యర్థి అయినా అక్కడ బలంగా ఉన్నారా? 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి గత రెండు ఎన్నికలల్లోనూ దుర్గం చిన్నయ్య విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా విజయం‌ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. సింగరేణి కాలరీస్ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి చిన్నయ్య పట్టాలు ఇప్పించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్  ఇండ్లను కూడా నిర్మించి పేదలకు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాలకు మాత్రం రోడ్లు నిర్మించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు మినహా..తన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో చేసిందేమీ లేదనే అపవాదును ఎదుర్కొంటున్నారు. 

బెల్లంపల్లిలో ‌‌మెడికల్ కాలేజ్‌.. బస్సు డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. ప‌క్కనే ఉన్న మంచిర్యాలలో మెడికల్ ‌కళశాల నిర్మాణమై తరగతులు కూడా మొదలయ్యాయి. బస్సు డిపో చెన్నూర్ కు మంజూరైనా..బెల్లంపల్లికి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే వైఫల్యం వల్లనే మెడికల్ కళాశాల, బస్సు ‌డిపో రాలేదని ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇవే కాదు.. మారుమూల ప్రాంతాల్లో ఏమాత్రం ‌ప్రగతి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

కనీస వసతులు‌‌‌లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు‌. నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు ఎమ్మెల్యే వెళితే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. పదేళ్ళుగా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారా అంటూ..ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామంలోకి రాకుండా ఆపివేసి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అభివృద్ధి చేయకపోవడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం ఒక భాగం అయితే..అరిజన్ కంపెనీ ప్రతినిధి షేజల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరువు తీసేసాయి. మహిళా ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత పెరిగినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. చిన్నయ్య అసమర్థత, ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఎమ్మెల్యేను ఓడించాలంటూ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అయితే ఎవరెంత ప్రచారం చేసుకున్నా తన విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే చిన్నయ్య.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి గడ్డం వినోద్‌ ఓటమి చెందారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ..దుర్గం చిన్నయ్య మీద వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గడ్డం వినోద్‌ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌కు ఊపు రావడం కూడా వినోద్‌కు కలిసివస్తుందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ప్రచారం సందర్భంగా ఏ గ్రామానికి వెళ్లినా  ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందట. ప్రజల స్పందనే వినోద్‌లో గెలుపు పై ధీమాను పెంచుతున్నాయట. కాని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరరావు వర్గం వినోద్‌కు వ్యతిరేకంగా పని చేస్తోందట. పార్టీలోని వర్గ విభేదాలు వినోద్‌కు ఆందోళన కలిగిస్తున్నాయట.

ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌కు ధీటుగా కమలం పార్టీ కూడా ఎన్నికల యుద్ధం చేస్తానంటోంది. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాని బెల్లంపల్లి నియోజకవర్గంలో కమలం పార్టీకి బలం లేదు. ‌మాజీ ఎమ్మెల్యేగా ప్రజల్లో తనకు పలుకుబడి ఉందని..తనకున్న ప్రజాదరణే ఈసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని శ్రీదేవి భావిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో బిజెపికి ఇక్కడ  డిపాజిట్ కూడా రాలేదు.‌‌ ఇప్పుడు మాత్రం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి. ముక్కోణపు పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement