Upendra Kushwaha Announced Break Up With Janata Dal-United In Bihar - Sakshi
Sakshi News home page

బీహార్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. సీఎం నితీష్‌కు హ్యాండిచ్చిన కుష్వాహా

Published Mon, Feb 20 2023 3:52 PM

Upendra Kushwaha Announced Break Up With Janata Dal United In Bihar - Sakshi

పాట్నా: బీహార్‌ రాజకీయం హీటెక్కింది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఊహించని షాక్‌ తగిలింది. సీఎం నితీష్‌తో విబేధాల కారణంగా జనతాదళ్‌(యునైటెడ్‌)కి ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్‌పర్సన్‌ ఉపేంద్ర కుష్వాహా వీడ్కోలు చెప్పారు. జేడీయూకు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇదే సమయంలో బీహార్‌ సీఎంపై సీరియస్‌ కామెంట్స్‌ కూడా చేశారు. 

ఈ సందర్బంగా ఉపేంద్ర కుష్వాహా మీడియాతో మాట్లాడుతూ..‘మేము కొత్త పార్టీ.. రాష్ట్రీయ లోక్ జనతా దళ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. కొత్త పార్టీకి నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటాను. క‌ర్పూరి ఠాకూర వార‌స‌త్వాన్ని త‌మ పార్టీ ముందుకు తీసుకువెళుతుంద‌ని తెలిపారు. సీఎం నితీష్‌ కుమార్‌ వైఖరి పట్ల కొద్ది మంది మినహా.. జేడీయూలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో బీహార్‌ కోసం నితీష్‌ కుమార్‌ మంచి చేశారు. కానీ.. ఇప్పుడు అతడి నిర్ణయాలు బీహార్‌ ప్రజలకు అనుకూలంగా లేవు. సీఎం నితీష్‌ తన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు(పరోక్షంగా తేజస్వీ యాదవ్‌పై విమర్శలు) అని అన్నారు. 

ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తన రాజకీయ వారసుడిని తయారు చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఈ కారణంగానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గత రెండు రోజులుగా పాట్నాలో సమావేశాలు, చర్చలు జరిగాయి. మాకు మద్దతుగా ఉన్న నేతలు కూడా ఏకగ్రీవంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకే కొత్త పార్టీతో ముందుకు సాగుతాము. ఇదే క్రమంలో శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కుష్వాహా ప్రకటించారు. 

ఇదిలా ఉండగా.. అంతుకు ముందు 2025లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్‌కు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ నాయకత్వం వహిస్తారని ఇటీవల నితీశ్‌ చేసిన ప్రకటన కూడా ఉపేంద్ర అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కుష్వాహా పలుసార్లు తమ కూటమిలోకి రావడం, వెళ్లడం పట్ల నితీశ్‌కుమార్‌ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన జేడీయూని వీడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కుష్వాహా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement