Bad Breath: Top 5 Best Ways To Stop Bad Smell From Mouth In Telugu - Sakshi
Sakshi News home page

నోటి దుర్వాసనా.. ఇలా దూరం చేసుకోండి!

Published Fri, May 28 2021 11:53 AM

Get Rid Of Bad Breath With These Simple Tips - Sakshi

పదిమందిలో మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది కలిగించే అంశం.. నోటి నుంచి దుర్వాసన! సాధారణంగా ధూమపానం, మద్యపానం, గుట్కా, తంబాకు, వక్కపొడి లాంటి అలవాట్లున్నవారిలో ఈ సమస్య అధికం. కానీ కొంతమందిలో పైన చెప్పిన ఎలాంటి అలవాట్లు లేకున్నా, ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇందుకు  ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది సరైన నోటి శుభ్రత (ఓరల్‌ హైజీన్‌) పాటించకపోవడం, రెండవది కడుపులో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం. నోటి దుర్వాసన సమస్యను వైద్య పరిభాషలో ‘హాలిటోసిస్‌’ అంటారు. 

నోటి నుంచి దుర్వాసన వస్తోందంటూ డాక్టరును సంప్రదిస్తే మొదటగా ఆయన అడిగే ప్రశ్న ‘మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కాస్త చెప్పండి’ అంటూ మనం తీసుకునే ఆహారం గురించే అడుగుతారు.ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం, తాజా తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తినాలంటారు. అలాగే ద్రవ పదార్థాలు పుష్కలంగా తాగాలంటారు.  ఇవన్నీ మీ గ్యాస్ట్రో ఇంటస్టైనల్‌ ట్రాక్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో కడుపులో ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులూ తలెత్తవు.  ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన మరో జాగ్రత్త కూడా ఉంది. అదే... ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఫ్లాసింగ్‌ ప్రక్రియ ద్వారా దంతాలను శుభ్రం చేసుకోవాలి.

ఈ చిట్కాలు బెటర్‌..

  • నోటి దుర్వాసనను సమర్థంగా ఎదుర్కోవడంలో కొత్తిమీర, పుదీన, యూకలిప్టస్, రోజ్‌మేరీ, ఏలక్కాయ వంటివి బాగా పని చేస్తాయి. ఈ ఔషధీయ పదార్థాలను అలాగే నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని అపసవ్యతలు తగ్గి, పనితీరు మెరుగవుతుంది. దాంతో నోటి దుర్వాసనా దూరమవుతుంది.  అలాగే మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం తరవాత కూడా  చివరగా ఏలక్కాయ, కొత్తిమీర, పుదీన వంటి వాటిని తినడం ద్వారా నోటి దుర్వాసనను దూరంగా ఉండవచ్చు.
  • తాజాపరిశోధనల ప్రకారం... రోజూ తాజా పెరుగు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమైన హైడ్రోజెన్‌ సల్ఫేడ్‌ పాళ్లను అదుపుచేయవచ్చు. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా దంతాల మీద పాచి పేరుకోవడాన్ని, చిగుళ్ల వ్యాధులను కూడా నివారించవచ్చు. 
  • నమిలినప్పుడు కరకరలాడే (అంటే క్రంచీగా అనిపించే పండ్లు) పండ్లు అయిన ఆపిల్స్, క్యారట్స్‌ వంటి పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉండేవాటినీ, కూరగాయలు నోటి దుర్వాసనకు విరుగుడుగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల లాలాజలం ఎక్కువగా విడుదలై నోటిని శుభ్రంగా ఉంచుతుంది.
  • కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన చాలా రకాల పోషకాహారం దంతాల మీద పాచి పేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ సమస్యను పండ్లు, ఆకుకూరలు, కాయగూరలను తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు.
  • హాలిటోసిస్‌కు చిగుళ్ల వ్యాధులు, జింజవైటిస్‌ వంటి దంతాల సమస్యలు ముఖ్యమైన కారణాలు. వీటిని నివారించాలంటే‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు, ఉసిరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
  • చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement