ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు | Sakshi
Sakshi News home page

ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు

Published Sat, Jul 9 2022 6:19 AM

Equity mutual funds see Rs15,498 crore inflow in June - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎప్పటి మాదిరే జూన్‌ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్‌లో కాస్తంత తగ్గాయి.

ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి జూన్‌ నెల గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్‌ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్‌ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి.

బంగారం ఈటీఎఫ్‌లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్‌ విభాగం నుంచి జూన్‌ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్‌ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్‌ నెలలో ఫండ్స్‌ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్‌ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి.  

ప్రతికూలతలు ఉన్నా..  
‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ కవిత కృష్ణన్‌ తెలిపారు.

మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్‌ మాసంలోనే ఎఫ్‌పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్‌ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement