స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్‌ సరఫరా | Sakshi
Sakshi News home page

స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్‌ సరఫరా

Published Mon, Mar 8 2021 5:14 AM

Supply of Sanitary Napkins in Schools and Colleges by AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్‌కిన్స్‌ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి సంవత్సరానికి 120 ప్యాడ్స్‌ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్‌ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయి. 

తక్కువ ధరతో సరఫరాకు ఆలోచన
► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్‌ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్‌కిన్‌లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
► ఇందు కోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్‌ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్‌కిన్లు లబ్ధిదారులకు ఎల్‌–1 రేటు కంటే 15% మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. 
► రాష్ట్రంలో 18–50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుదని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే– 4 (2015–16) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది.
► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – వి (2019–20) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది  రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. (పట్టణాల్లో 90.6%, గ్రామీణ ప్రాంతాల్లో 82.5%) పరిశుభ్రమైన పద్ధతిలో స్థానికంగా తయారు చేసిన న్యాప్‌కిన్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది.  

Advertisement
 
Advertisement