ప్రజారాజ్యం కోసం మరో ఉద్యమం | Sakshi
Sakshi News home page

ప్రజారాజ్యం కోసం మరో ఉద్యమం

Published Thu, Jul 31 2014 2:50 AM

ప్రజారాజ్యం కోసం మరో ఉద్యమం - Sakshi

  •      3లక్షల ఎకరాల భూమిని పంచాలి
  •      రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్న బాబు
  •      సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
  • పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తా :తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్య స్థాపన కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వరంగల్‌లోని ఆజంజాహి మిల్లు ఓ సిటీ(చాకలి ఐలమ్మ నగర్) ప్రాంగణంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీ య మహాసభలను పురస్కరించుకొని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షతన బుధవారం బహిరంగ సభ జరిగింది.

    ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రమే శరణ్యమని భావించి ప్రజలు ఉద్యమించారని, ఆ కల సాకారం కావడం సంతోషకరమని అన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనేక వాగ్దానాలు చేశారని, ప్రజలు ఆ విశ్వాసంతోనే పట్టం కట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14లక్షల మంది దళితులు ఉండగా, అందులో 10లక్షల మందికి భూమి లేదన్నారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న 3 ఎకరాల భూమిని ఆగస్టు 15 నాటి పంపిణీ చేయాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు.

    అయితే 30లక్షల భూమి ప్రభుత్వం వద్ద ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. గిరిజన చట్టాలను పక్కాగా అమ లు చేయాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ఆగస్టు 7న రాష్ట్రంలోని పది కమ్యూనిస్టు పార్టీలతో చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ అని కేసీఆర్ ప్రకటించడం సరైన నిర్ణయమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పష్టమైన జీఓలు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
     
    భూముల్లో జెండాలు పాతండి : మల్లు స్వరాజ్యం
     
    కనిపించిన భూముల్లో ఎర్ర జెండాలు పాతాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పిలుపునిచ్చారు. నాడు జమీందార్లు, నైజాంలు, దొరలు, భూస్వాముల అరాచకాలకు వెనుకాడ లేదని, ఎదురొడ్డి నిలిచిపోరాడామన్నారు. చాకలి ఐలమ్మను స్పూర్తిగా తీసుకొని మలి దశ ఉద్యమంలో యువత ముందుకు సాగాలని కోరారు. కేసీఆర్ చుట్టూ అంబానీలు, ఇతర కార్పొరేట్ సంస్థల ప్రతి నిధులు తిరుగుతున్నారన్నారు. ఇక్కడి గ్యాస్ తీసుకెళ్లి అమెరికాలో అమ్ముకుంటున్న అంబానీతో భేటీ కావడం సమంజసం కాదన్నారు. మద్యపాన నిషేధం అమలు కోసం మరో ఉద్యమం చేపట్టాల్సిన అవశ్యకత ఉందన్నారు.
     
    ఈజిప్టు తరహాలో వీధుల్లోకి రావాలి : విజయ రాఘవన్
     
    ఈజిప్టు, అరబ్ దేశాల్లో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, అదే తరహాలో దేశంలో కూడా ప్రజలు ఉద్యమించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. నాటి యుపీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అమలులో పూర్తిగా విఫలమైందని, నేటి ఎన్‌డీఏ ప్రభుత్వ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ఆహార భద్రతను ఎత్తివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టాలన్నారు. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నుంచి సమర శంఖారావం పూరించడం ఆనందంగా ఉందన్నారు.
     
    భద్రాచలం జల సమాధికి కుట్ర : ఎమ్మెల్యే సున్నం రాజయ్య
     
    తెలంగాణలోని భద్రాచలంను జల సమాధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సెంటు భూమిని కూడా ఆంధ్రా ప్రాంతానికి వదిలేది లేదని, ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గిరిజనులు భూములను సాగు చేసుకోకుండా అటవీ శాఖ, పోలీసులు తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారన్నారు.

    వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య మాట్లాడుతూ వరంగల్‌లో ఒక్క రూపాయి పెట్టకుండా పచ్చసిరాతో సంతకం పెడితే 3లక్షల ఎకరాల భూమి దొరలు, పెత్తందార్ల నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజా ఉద్యమాలు చేసి 30 నెలల్లో ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని గద్దె దింపుతామని హెచ్చరించారు.

    బహిరంగ సభలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు పోటూరి రామయ్య, కార్యదర్శి అన్నాన్ ముల్లా, ఉపాధ్యక్షులు సురీత్ చోప్రా, కుమార్ సిరాల్ ఖార్, తిరువనక్కరసు, త్రిపుర రాష్ట్ర ఆహార శాఖ మంత్రి బోమాలాల్ సహా, జాతీయ నాయకులు సుభాషిణీ అలీ, బి.వెంకట్, వెంకటేశ్వర్లు, సీపీఎం నగర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చుక్కయ్య, రంగయ్య, దుబ్బా శ్రీనివాస్, రాగుల రమేష్, నలిగంటి రత్మమాల, కొప్పుల శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, కుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement