నైస్‌పై దర్యాప్తు | Sakshi
Sakshi News home page

నైస్‌పై దర్యాప్తు

Published Fri, Jul 25 2014 3:01 AM

నైస్‌పై దర్యాప్తు

  • రూ. కోట్లలో కుంభకోణం  జరిగిందనే ఆరోపణలపై సభా సంఘం ఏర్పాటు
  •  రాష్ర్ట ప్రభుత్వ ప్రకటన
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  బెంగళూరు, మైసూరు మధ్య వేగవంత రహదారి (బీఎంఐసీ) నిర్మాణాన్ని చేపట్టిన నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజస్ (నైస్)కు భూముల కేటాయింపులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి సభా సంఘాన్ని నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సభలో జరిగిన చర్చకు ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌సీ. మహదేవప్ప గురువారం సమాధానమిస్తూ ‘ఈ ప్రభుత్వం ఉన్నది అమ్మకానికి కాదు. బీఎంఐసీ ప్రాజెక్టు విషయంలో అనేక సంవత్సరాలుగా అనుమానాలున్నాయి.

    ఇలాంటి విషయాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వం రాజీ పడదు. నైస్ కంపెనీకి భూముల కేటాయింపుపై సభా సంఘం దర్యాప్తు జరుగుతుంది’ అని ఆయన ఉద్వేగపూరితంగా ప్రకటించారు. మంత్రి ఈ ప్రకటన చేస్తుండగానే పార్టీలకు అతీతంగా సభ్యులందరూ బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేశారు. సభా సంఘాన్ని వీలైనంత త్వరగా నియమిస్తామని మంత్రి ప్రకటించారు. నైస్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే అశోక్ ఖేణిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రాజెక్టు చుట్టూ సంవత్సరాల తరబడి వ్యక్తమవుతున్న సందేహాలు, అవకతవకలు నిజమేనా... అని ప్రభుత్వం తెలుసుకోదలచిందని వివరించారు. సభా సంఘం వాస్తవాలను వెలికి తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా అంతకు ముందు జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులు పార్టీలకతీతంగా నైస్ తీరుపై ధ్వజమెత్తారు. విలువైన ప్రభుత్వ భూములను నైస్‌కు కేటాయిస్తే, కోట్ల రూపాయలకు వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకుందని ఆరోపించారు.

    దేవెగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో సదుద్దేశంతో బీఎంఐసీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని మంత్రి కితాబునిచ్చారు. అయితే రోజు రోజుకు ఈ ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇందులో వందల కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందనే అనుమానాలు తలెత్తాయని చెప్పారు. ‘ఈ సభ అమ్మకానికి సిద్ధంగా లేదు.

    ఈ సభ సందేహాలకు అతీతంగా వ్యవహరిస్తుంది’ అని చర్చ సందర్భంగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేస్తూ, ‘సార్ మీరు ఈ మాటలు అన్నప్పుడు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ కుర్చీపై కూర్చుని మాట్లాడుతున్నారా అని అనిపించింది. మీపై గౌరవం పదింతలైంది. నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కూడా అమ్మకానికి సిద్ధంగా లేదు’ అని మంత్రి  ఉద్వేగంగా ప్రకటించారు.
     

Advertisement
Advertisement