ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే.. | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే..

Published Fri, Aug 5 2016 3:31 AM

ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే..

లెఫ్ట్‌నెంట్ గవర్నరే అక్కడ పరిపాలనాధికారి
ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ..    
ఎల్‌జీ అనుమతి లేని ప్రభుత్వ నోటిఫికేషన్లు చట్టవిరుద్ధమని ప్రకటన
 
 సాక్షి, న్యూఢిల్లీ:
అధికారాల విషయమై కేంద్రంతో పోరాడుతున్న కేజ్రీవాల్ సర్కారుకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని, దానికి పరిపాలనాధికారి లెఫ్ట్‌నెంట్ గవర్నరే(ఎల్జీ) అని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. 

కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్ 239ను ఢిల్లీ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 239ఏఏ తగ్గించేందుకు అవకాశం లేదని, పాలనాంశాలకు సంబంధించి ఎల్జీ ఆమోదం తప్పనిసరి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ జయంత్‌నాథ్‌ల బెంచ్ తన 194 పేజీల తీర్పులో పేర్కొంది. ఆర్టికల్ 239ఏఏలోని 69వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఢిల్లీపై  పాలనా బాధ్యతలు అంతిమంగా రాష్ట్రపతికే ఉంటాయని తేల్చింది.  239ఏఏ ప్రకారం ఎల్జీ.. సీఎం,  కేబినెట్ సలహా మేరకు వ్యవహరించాలని ఆప్ సర్కారు చేసిన వాదనను బెంచ్ తోసిపుచ్చింది.   ఎల్జీ  అనుమతి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టం చేయలేదని, ముందస్తు అనుమతి తర్వాతే ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల గవర్నర్లకంటే ఢిల్లీ ఎల్జీ విచక్షణాధికారాల పరిధి ఎక్కువని, ఆయన కేబినెట్ సలహా ప్రకారం కాక.. సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చంది. శాసనాధికారాలు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీపై పరిపాలనాధికారం తదితర అంశాలకు సంబంధించి కేంద్రం, ఢిల్లీ సర్కారు వేసిన పలు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించిన పిటిషన్ మినహా మిగతా అన్ని పిటిషన్లలో ఆప్ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది.ఎల్జీ  అనుమతి లేకుండా ఆప్ ప్రభుత్వం సీఎన్‌జీ ఫిట్‌నెట్ కిట్ల స్కాం, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవకతవలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు చెల్లవని కోర్టు చెప్పింది. ప్రైవేటు డిస్కమ్‌లకు డెరైక్టర్ల నియామకానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పక్కనపెట్టింది. తమ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) సక్రమంగా పనిచేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు జరపకుండా నోటిఫికేషన్ జారీ చేసిందనే అంశంపైనా ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట లభించలేదు. సర్వీసుకు సంబంధించి అంశాలు అసెంబ్లీకి వెలుపలివని, దీనిపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ సరైనదేనని పేర్కొంది. ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక సర్వీస్ కేడర్ లేదని  పేర్కొంది. కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలకు సంబంధించిన ప్రతిదాన్నీ సుప్రీంకోర్టు మాత్రమే విచారించజాలదని స్పష్టం చేసింది.
 
 
సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఆప్
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ  ఎల్జీ ఆధ్వర్యంలో నడుస్తుంటే.. రాజ్యాంగానికి సవరణ చేసి అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేశారని . ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వల్ల అవినీతికి అడ్డుకట్ట వేసే చర్యలకు విఘాతం కలుగుతోందన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను ఎల్జీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తీర్పుపై బీజేపీ స్పందిస్తూ.. రాజ్యాంగపరమైన చట్టాల గురించి ఢిల్లీ సీఎం శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేసింది. తీర్పు కేజ్రీవాల్‌కు చెంపపెట్టు అని, ఆయన రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని లేకుంటే రాజీనామా చేయాలని సూచించింది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement