టీమిండియాను ఊరిస్తున్న విజయం! | Sakshi
Sakshi News home page

టీమిండియాను ఊరిస్తున్న విజయం!

Published Thu, Nov 26 2015 4:59 PM

టీమిండియాను ఊరిస్తున్న విజయం! - Sakshi

నాగ్ పూర్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. రెండో రోజు 310 పరుగుల విజయలక్ష్యంతో  సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఓపెనర్ వాన్ జిల్ (5) ను అశ్విన్ బోల్తా కొట్టించగా,  నైట్ వాచ్ మెన్ ఇమ్రాన్ తాహీర్(8) ను అమిత్ మిశ్రా పెవిలియన్ కు పంపాడు. దీంతో గురువారం ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. 

 

11/2 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 68 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. అనంతరం టీమిండియ రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులు చేసింది.  టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(5) ఆదిలో పెవిలియన్ కు చేరినా.. శిఖర్ ధవన్(39), చటేశ్వర పూజారా(31)లు రాణించారు. అనంతరం విరాట్ కోహ్లి(16), రహానే(9)లు నిరాశ పరిచారు. ఆపై రోహిత్ శర్మ(23), అమిత్ మిశ్రా(14) ఫర్వాలేదనిపించారు.  దీంతో సఫారీల ముందు మూడొందల పరుగులకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించారు. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 278 పరుగులు అవసరం కాగా, చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉండగా తొలి రోజు ఆటలో 12 వికెట్లు పడగా,  రెండో రోజు ఆటలో 20 వికెట్లు నేలరాలడం గమనార్హం.

 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ 215 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 173

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 79 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 32/2

Advertisement
Advertisement